Karimnagar Crime: కవర్ అడ్డుగా పెట్టి ఫోన్ కొట్టేసిన ఖిలాడీ - సీసీ ఫుటేజీ చూసి బాధితుడు షాక్!
Karimnagar Crime News: టిఫిన్ చేసేందుకు హోటల్ కు వెళ్లిన ఓ వ్యక్తి నుంచి.. ఓ దొంగ కవర్ అడ్డు పెట్టి మరీ ఫోన్ కొట్టేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Karimnagar Crime News: హోటల్ లో టిఫిన్ చేసేందుకు కుటుంబ సభ్యులతో ఓ వ్యక్తి వెళ్లాడు. అయితే బిల్లు కట్టే సమయంలో.. ఓ వ్యక్తి అతని వద్దకు వచ్చి పక్కనే నిలబడ్డాడు. చేతిలో కవర్ పట్టుకొని.. పక్కనే నిల్చుని ఉన్న వ్యక్తి జేబులోంచి చాకచక్యంగా ఫోన్ కొట్టేశాడు. అసలు ఆ ఫోన్ తన జేబులోంచి తీసినట్లు కూడా సదరు వ్యక్తి గుర్తించలేకపోయాడు. చాలాసేపటి తర్వాత తన ఫోన్ కనిపించడం లేదని గుర్తించి అప్పుడు సీసీ కెమెరాలు పరిశీలించగా... అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..?
కరీనంగర్ జిల్లా కేంద్రంలోని బస్టాంబ్ సమీపంలో ఉన్న ఓ హోటల్ కు వీణవంక మండలం దేశాయిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ లక్ష్మణ్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు టిఫిన్ చేశారు. అనంతరం బిల్లు కట్టేందుకు కౌంటర్ వద్దకు వెళ్లగా.. ఓ వ్యక్తి వచ్చి తన పక్కనే నిలుచున్నాడు. చేతిలో పాలిథిన్ కవర్ పట్టుకొని మెల్లిగా లక్ష్మణ్ జేబులో ఉన్న ఫోన్ ను చోరీ చేశాడు. అయితే తనకు కవర్ తగిలిందనుకున్నాడు. కానీ ఫోన్ చోరీ జరిగిందని లక్ష్మణ్ కు తెలియలేదు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఫోన్ పోయిందని గుర్తించిన వ్యక్తి.. హోటల్ సిబ్బందికి చెప్పాడు. సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించి.. ఓసారి చూపించమని కోరారు. ఈక్రమంలోనే తన ఫోన్ కొట్టేసిన వ్యక్తిని గుర్తించారు. హోటల్ సిబ్బందిని అడిగి సీసీటీవీ ఫుటేజీ వీడియో తీసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గత నెలలో ఫోన్ పోగొట్టుకున్న మంత్రి ఎర్రబెల్లి
సాధారణంగా ఎక్కడికైనా జన సమూహం ఉన్న చోటకు వెళ్లినా, రద్దీ ఉన్నచోట మొబైల్ పోయింది, పర్సు పోయింది అనే మా వింటుంటాం. అయితే తాజాగా తెలంగాణ మంత్రికి వింత అనుభవం ఎదురైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. దాంతో ఈ విషయం వైరల్ గా మారింది.
మైక్ లో మాజీ డిప్యూటీ సీఎం అనౌన్స్ మెంట్
స్టేషన్ ఘన్ పూర్, శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి ఎర్రబెల్లి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే తన సెల్ ఫోన్ లేదని గుర్తించారు. తన సెల్ ఫోన్ పోయిందని మంత్రి తన గన్ మెన్లకు తెలిపారు. శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మొబైల్ పోయిందని, ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మైక్ లో అనౌన్స్ చేయడంతో భక్తులందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఎవరైనా కావాలనే మంత్రి ఫోన్ కొట్టేశారా లేక ఎక్కడైనా పడిపోయిందా అనే విషయం ఎవరికీ తెలియదు. నిజంగానే ఎక్కడైనా పడిపోతే ఫోన్ దొరుకుతుందని అంతా భావించారు. కానీ కావాలనే ఎవరైనా కొట్టేస్తే మాత్రం ఫోన్ ఇక చేతికి రాదనుకున్నారు. అయినప్పటికీ పోలీసుల చేత కూడా ఫోన్ ను వెతికించారు.