Devika Murder Case: వేరే వాళ్లతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతోనే దేవిక హత్య: కాకినాడ ఎస్పీ
Devika Murder Case: వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతోనే సూర్యనారాయణ దేవికను హత్య చేసినట్లు కాకినాడ ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు. పథకం ప్రకారమే ఆమెను హత్య చేసినట్లు వివరించారు.
Devika Murder Case: కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో దేవిక(22) అనే యువతి హత్య కేసులో కీలక విషయాలను రాబట్టారు పోలీసులు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కాకినాడ ఎస్పీ ఎం. రవీంద్ర బాబు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు దేవిక, నిందితుడు గుబ్బల సూర్య నారాయణ మూర్తిల మద్య ముందు నుంచే సాన్నిహిత్యం ఉందని ఎస్పీ రవీంద్ర బాబు తెలిపారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని... కానీ కొన్ని కారణాల వల్ల పెద్దల సమక్షంలో విడిపోయారని వివరించారు. ఈ క్రమంలోనే దేవిక మరో వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉంటుందనే అనుమానంతో ఆమెను హత్య చేయాలనుకున్నాడని వెల్లడించారు. పథకం ప్రకారమే కత్తి వెంట తీసుకొని వెళ్లినట్లు చెప్పారు. ముందుగా సూర్య నారాయణ.. దేవికతో గొడవకు దిగాడని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన సూర్య నారాయణ దేవికపై దాడి చేసినట్లు వివరించారు. అయితే సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయిందని ఎస్పీ రవీంద్ర బాబు స్పష్టం చేశారు.
"ఇంత కాలం మా మధ్య లవ్ ఎఫైర్ నడిచింది. పెళ్లి కూడా చేస్కోవాలనుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో పెద్దలు కొంత మంది రిజెక్ట్ చేయడం వల్ల ఇది ఆగిపోయింది అనేది మనసులో ఉంది. దానికి తోడు ఈ అమ్మాయి వేరే వాళ్లతో సాన్నిహిత్యంగా ఉందని అనుమానం ఈయనకు. ఈ అనుమానం ఆయన మనసును తొలిచి వేసి.. ఇంతకాలం మేం లవ్ చేసుకున్నాం. ఇప్పుడు నన్ను కాదని వేరే వాళ్లతో వెళ్తుందని మనసులో పెట్టుకున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే నన్ను రిజెక్ట్ చేస్తుందనే భావనతో హైదరాబాద్ నుంచి తిరిగొచ్చాడు. ఆమె బిజినెస్ పని ముగించుకొని ఇంటికొచ్చే సమయంలో కాపు కాచి ఆమెను ఆపాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె కేకలు వేయడంతో.. పక్కనే పొలాల్లో పని చేసుకునే వాళ్లు పరిగెత్తుకొచ్చారు. కానీ అంతలోనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది" - ఎస్పీ రవీంద్ర బాబు
అసలేం జరిగిందంటే..?
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలారం గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ(25) బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం కె.గంగవరం గ్రామానికి చెందిన దేవిక(22)లు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే సూర్య నారాయమ తన కూరాడలోని తన బంధువుల ఇంటి వద్ద ఉండేవాడు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో పెళ్లి జరగలేదు. సూర్య నారాయణను హైదరాబాద్ లో ఉంటున్న తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించేశారు. ఇక అప్పటి నుంచి దేవికపై అతడు అనుమానం పెంచుకున్నాడు. ఆమె మరొకరితో సాన్నిహిత్యం పెంచుకుందని ఆమెపై పగ పెంచుకున్నాడు. శనివారం ప్లాన్ ప్రకారం బైక్ పై కూరాడ వెలుతున్న దేవికను... కూరాడ - కాండ్రేగుల గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డగించాడు.
యాసిడ్ సీసా కూడా..
ఈ క్రమంలోనే ఇద్దరూ గొడవ పడ్డారు. ఇక వాదించి లాభం లేదనుకొని వెంట తెచ్చుకున్న కత్తితో దేవికపై దాడి చేశాడు. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడిని పట్టుకున్న స్థానికులు చెట్టుకు కట్టేసి చితకబాదారు. దేవికను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని పెదపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. యువకుడు తన వెంట యాసిడ్ సీసా కూడా తెచ్చుకున్నాడని పోలీసులు తెలిపారు.