Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణం, ఆరు నెలల గర్భిణీపై కత్తితో దాడి!
Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణ ఘటనచోటుచేసుకుంది. ఆరు నెలల నిండు గర్భిణీపై కత్తితో దాడి చేసి హత్యచేశాడు ఓ కిరాతకుడు.
Kakinada Crime : కాకినాడ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఏలేశ్వరం మండలంలోని అప్పన్నపాలెంలో ఓ ఉన్నాది ఆరు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. అప్పన్నపాలేనికి చెందిన దూసర నాగరత్నానికి వివాహం అయింది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి కూడా. అయితే సోమవారం బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో భర్త, కుటుంబ సభ్యులు వేరే ఊరు వెళ్లారు. ఇంట్లో నాగరత్నం మాత్రమే ఉండగా పిల్లి రాజు అనే వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేశారు. అయితే వీరిద్దరికి మధ్య వివాహేతర సంబంధం ఉందని స్థానికులు అంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరత్నం వద్దకు పిల్లి రాజు రావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పిల్లి రాజుకు కూడా పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. ఈ హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న పిల్లిరాజు కోసం గాలింపు చేస్తున్నారు. నిందితుడు పిల్లి రాజుపై అంతకుముందు కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడని హత్య
చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకోవడమో, లేక హత్యలు చేసి హంతకులుగా మారుతున్న కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సరిగ్గా విశాఖలో ఇలాంటి ఘటనే ఇటీవల జరిగింది. విశాఖలోని అల్లిపురంలో జరిగిన పెయింటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు గల కారణం వెల్లడైంది. కేవలం తన తల్లిని తిట్టాడని పెయింటర్ శ్రీనును హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో తేలింది.
అసలేం జరిగింది?
అల్లిపురం వద్ద గొంతిన శ్రీను అనే 45 ఏళ్ల వ్యక్తి పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి భార్య , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద అమ్మాయికి పెళ్లి కాగా రెండో అమ్మాయి ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. భార్య ఇళ్లల్లో పాచిపని చేస్తుంది. కొన్నేళ్ల కిందట శ్రీను మద్యానికి అలవాటు పడ్డాడు. తాగుటు అలవాటుతో ఇంట్లో గొడవలు, బయట సైతం తరచు గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో ఎలైట్ జంక్షన్ వద్ద కూలి పనులకోసం ప్రతీ రోజూ ఉదయం నిలబడతాడు. ఎవరు వచ్చి పనికి పిలిస్తే వారితో వెళుతుంటాడు. ఆదివారం సైతం పని కోసం ఎదురుచూస్తూ జంక్షన్ వద్ద నిల్చున్నాడు పెయింటర్ శ్రీను. ఆ సమయంలో అటుగా వెళుతున్నబియ్యా గౌరి అనే మహిళను చూసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా తనతో రమ్మంటూ మరింత దిగజారి మాట్లాడాడు. పెయింటర్ చేష్టలతో గౌరి కోప్పడింది. తనకు ఎదురుచెప్పడంతో ఆమెను దూషించడం మొదలుపెట్టాడు. వాగ్వివాదం గొడవకు దారితీసింది.
తల్లీకొడుకులు దాడి
అక్కడే ఉన్న కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి , సిమెంట్ షాపులో పనిచేసే మరో వ్యక్తి వారిద్దరికి సర్దిచెప్పి గొడవ విడదీశారు. దాంతో గౌరి, పెయింటర్ శ్రీను ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే తనకు జరిగిన అవమానం, పెయింట్ అసభ్య ప్రవర్తన గురించి తన కుమారుడు బియ్యా ప్రసాద్ కు గౌరి ఫోన్ చేసి చెప్పింది. విషయం తెలియగానే బైకు మీద తల్లిని తీసుకుని అక్కడకు వచ్చాడు బియ్యా ప్రసాద్. పెయింటర్ శ్రీనుపై తల్లికొడుకులు దాడికి పాల్పడ్డారు. తల్లీకొడుకులు కలిసి తనపై దాడి చేయడంతో భయాందోళనకు గురైన శ్రీను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న సందులోకి పారిపోయినా, వీళ్లు అతడ్ని వదల్లేదు. ఎలాగోలా పెయింటర్ శ్రీనును వెంబడించి పట్టుకుని.. అతడి ముఖంపై ఇటుక రాయితో పదేపదే కొట్టారు. అతడి తలపై సైతం ఇటుకతో దాడి చేసి, అక్కడినుండి మెయిన్ రోడ్డు పైకి లాక్కొచ్చారు. లాడ్జి ఎదురుగా పడేసి దాడిచేస్తూ శ్రీను చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత తల్లీ కొడుకులు బైక్ పై పరారు అయ్యారు . ఈ ఘటన అంతా అక్కడి సీసీ టీవీల్లో రికార్డు అయింది . ఈ ఘటన వైజాగ్ లో సంచలనం సృష్టించింది.