(Source: ECI/ABP News/ABP Majha)
YS Viveka Murder: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్, సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో విచారణకు హాజరైన ఉదయ్ కుమార్ రెడ్డి సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ మంత్రి వివేకా హత్య(YS Viveka Murder) కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సీబీఐ విచారణ వేగవంతం చేస్తుంటే, అనుమానితులు ఒక్కొక్కరిగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సీబీఐ(CBI) అధికారులు ఒత్తిడి చేస్తున్నారని రివర్స్ లో సీబీఐ అధికారులపై ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా వివేకా హత్య కేసు అనుమానితుడు ఉదయ్ కుమార్ రెడ్డి కడప అదనపు ఎస్పీ(Kadapa Additional SP) మహేష్ కుమార్ ను కలిసి సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తాము చెప్పినట్లు వినాలని సీబీఐ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో ఉదయ్ కుమార్ రెడ్డి(Uday Kumar Reddy) పోలీసలకు ఫిర్యాదు చేశారు.
మళ్లీ విచారణ మొదలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలమైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ(Cbi enquiry) మళ్లీ ప్రారంభమైంది. కడప జిల్లా పులివెందుల(Pulivendula) ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విచారణ కొనసాగిస్తుంది. సీబీఐ తాజాగా మరో ముగ్గురు అనుమానితులను విచారించింది. గతంలో కడప జిల్లా సాక్షి బ్యూరోగా పని చేసి, ఇప్పుడు నెల్లూరు బ్యూరోగా పనిచేస్తున్న బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేశారు. వివేకా హత్య జరిగిన రోజున గుండెపోటుతో చనిపోయారని బాలకృష్ణారెడ్డికి శివశంకర్ ఫోన్ చేసి చెప్పారు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి(Shiva Shankar Reddy) ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ విషయంపై బాలకృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. పులివెందులకు చెందిన యూసీఐల్(UCIL) ఉద్యోగి ఉదయ్ కూమార్ రెడ్డిని కూడా సీబీఐ విచారణ చేసింది. వివేకా మృతదేహానికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం నమోదు చేసింది. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు చాలాసార్లు ప్రశ్నించారు. పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి(EC Gangi Reddy) ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు మధుసూదన్ రెడ్డి కూడా సీబీఐ విచారణ చేసింది.
ఛార్జిషీట్ లో కీలక అంశాలు
వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ కీలక అంశాలను పేర్కొంది. సెటిల్‌మెంట్‌ల్లో విభేదాల కారణంగానే వైఎస్ వివేకా హత్య జరిగినట్లు వెల్లడించింది. గత ఏడాది అక్టోబరు 26న పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ తాజాగా వెలుగుచూసింది. ఎర్ర గంగిరెడ్డి(Erra Gangi Reddy), సునీల్ యాదవ్(Sunil Yadav), ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి(Dastagiri) పేర్లను ఈ ఛార్జిషీట్ లో ప్రధానంగా పేర్కొంది. వివేకా హత్య జరిగిన రోజు ఆధారాలు మాయం చేసేందుకు కొంత మంది ప్రముఖులు కూడా ప్రయత్నించారని సీబీఐ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనలతో బెడ్ రూం, బాత్ రూంలను పని మనుషులు శుభ్రం చేశారని వెల్లడించింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వివేకా శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయని తెలిపింది. బెంగళూరు(Bengalore)లోని 8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్ విషయమై వివేకా, ఎర్ర గంగిరెడ్డికి మధ్య విబేధాలు ఉన్నాయని, వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు పేర్కొంది.