Constable Suicide: భార్య, పిల్లలను తుపాకితో కాల్చి చంపి, కానిస్టేబుల్ ఆత్మహత్య
Constable Suicide: కడప రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Constable Suicide: వైఎస్సార్ కడప జిల్లాలో దారుణం జరిగింది. కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు.. భార్యను, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురిని చంపి అనంతరం కానిస్టేబుల్ కూడా ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
కో-ఆపరేటివ్ కాలనీలో భార్యా, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు వెంకటేశ్వర్లు. కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చాడు. మళ్లీ తిరిగి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పోలీసు స్టేషన్ కు వెళ్లాడు వెంకటేశ్వర్లు. స్టేషన్ లోని స్టోర్ రూములో ఉన్న పిస్తోలు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే భార్యా, ఇద్దరు కుమార్తెలు నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న వారిపై స్టేషన్ నుంచి తీసుకువచ్చిన పిస్తోలుతో వెంకటేశ్వర్లు కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. వెంకటేశ్వర్లు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్లు.. రెండు సంవత్సరాల నుంచి కడప టూ టౌన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ కలహాలతోనే భార్యా, పిల్లలను చంపి తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు డీఎస్పీ షరీఫ్ వెల్లడించారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఇంట్లో లభించిన ప్రామిసరీ నోట్లు రిజిస్టర్ బాండ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ కు తరలించారు. కానిస్టేబుల్ ఇద్దరు కుమార్తెల్లో ఒకరు డిగ్రీ చదువుతున్నారు. మరొకరు ఇంటర్ చదువుతున్నారు. కుటుంబ సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అప్పులు, ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ కలహాలున్నట్లు బంధువులు వెల్లడించారు.
కాగా.. ఆత్మహత్య చేసుకునే ముందు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కు మృతుడు వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. అయితే తన లేఖలో.. హత్యకు, ఆత్మహత్యకు గల కారణాలు వివరించలేదని సమాచారం. కేవలం తన మరణం అనంతరం తనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ తన రెండో భార్య రమాదేవి కుటుంబానికి చెందేలా చూడాలని సూసైడ్ నోట్ లో ఎస్పీకి విన్నవించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఒంగోలులో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాదం చోటుచేసుకుంది. ఎం వెంకటేశ్వర్లు అనే ఓ ఏఆర్ కానిస్టేబుల్ తన వద్ద తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఒంగోలు కోర్టు సెంటర్ సమీపంలో ఆంధ్రాబ్యాంక్ వద్ద కాపలా ఉన్న ఆయన.. ఈరోజు మధ్యాహ్నం తన వద్ద ఉన్న తుపాకీతో తనను తాను కాల్చుకొని చనిపోయాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు రక్తపమడుగులో పడిన ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతుడు వెంకటేశ్వర్లు చీమకుర్తికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఒంగోలులో ఉంటూ విధులు నిర్వహిస్తుండగా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతను ఎందుకు అలా కాల్చుకొని చనిపోయాడన్న విషయం గురించి మాత్రం తెలియరాలేదు.