Bhupalpally News : గ్రామపంచాయతీ బిల్లులు పెండింగ్, అప్పుల బాధతో ఉప సర్పంచ్ ఆత్మహత్య!
Bhupalpally News : గ్రామపంచాయతీ అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో ఉపసర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నారు.
Bhupalpally News : గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రాకపోవడంతో ఉపసర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చోటుచేసుకుంది. కాటారం మండలం చిదినేపల్లి గ్రామ ఉప సర్పంచ్ బాలినేని తిరుపతి పంచాయతీ బిల్లులు మంజూరు కాకపోవడంతో మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం వరంగల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం గ్రామ సర్పంచ్ అంతర్గం రాజమౌళితో కలిసి అభివృద్ధి పనులు చేశారు. రూ.11 లక్షలతో రైతు వేదిక నిర్మాణం, గ్రామంలో వీధి లైట్లు, తదితర పనులు చేశారని, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తనతో చెప్పి తిరుపతి బాధపడేవాడని సర్పంచ్ అంతర్గం రాజమౌళి తెలిపారు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడినట్లు పేర్కొన్నారు. ఎనిమిది నెలల క్రితం భార్య కూడా ఆత్మహత్య చేసుకోగా వారి ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. ఉపసర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
18 మంది సర్పంచ్ లు రాజీనామా
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి 18 మంది సర్పంచులు ఇటీవల రాజీనామా చేశారు. తమ గ్రామాల అభివృద్ధికి నిధులు సక్రమంగా ఇవ్వడం లేదని, స్థానిక ఎమ్మెల్యే సైతం తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కుమ్రం భీమ్ జిల్లాలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్లు కూడా వేయలేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 18 మంది సర్పంచ్ లు రాజీనామా చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకుండా తాము గెలిచామన్నారు. తామంతా స్వతంత్రులుగా గెలుపొందినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు ఇస్తుందని, తమను ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ లో చేరామని స్పష్టం చేశారు.
బిల్లులు చెల్లించడంలేదు
ముఖ్యంగా ఆదివాసీ గూడెల్లో, గ్రామ పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని, తమకు సమయం కేటాయించాలని కోరినా స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడం లేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఆదివాసీల సమస్యలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇక తాము పార్టీలో ఉండి ఏం లాభమని దుయ్యబట్టారు. గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు సైతం తాము స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదవీ కాలం చివరి దశకు వచ్చినా కూడా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేకపోతున్నామని అన్నారు. భూప్రక్షాళన తరువాత చాలా మంది రైతులకు కొత్త పట్టాలు రాలేదని తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదని, కొత్త రేషన్ కార్డులు రాలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని ప్రజలు నిలదీస్తున్నారని వారి ముందు తలెత్తులేకపోతున్నామన్నారు. అందుకే తాము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.