Casino ED Raids : కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ చీకటి దందా చిన్నదేం కాదు - ఆయన రేంజ్ బ్యాంకాక్ వరకూ ఉంది !
కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుడివాడలో కేసినో నిర్వహించింది ఆయనే.
Casino ED Raids : కేసినోల నిర్వహణ అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే గోవా, శ్రీలంకల్లోని కేసినో కంపెనీలు ఇక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్‌ను సీక్రెట్‌గా నిర్వహించి జూదరుల్ని ఆకర్షిస్తాయని మాత్రం చాలా మందికి తెలుసు. ఇలా కేసినోల వ్యాపారాన్ని పెంచేందుకు ఆయా కంపెనీల తరపున తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తి చికోటి ప్రవీణ్. ఈయన పేరు ఇంతకు ముందు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ సంక్రాంతి సందర్భంగా గుడివాడలో భారీ ఎత్తున కేసినో ఏర్పాటు చేయడం.. ఆ వివరాలన్నీ బయటకు రావడంతో రచ్చ రచ్చ అయింది. ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. గతంలో పలుమార్లు ఈ కేసినోల వ్యవహారంలో చికోటి ప్రవీణ్ అరెస్టయ్యారు. కానీ తన దందాను మాత్రం ఆపలేదు. తాజాగా ఆయనతో పాటు మాధవరెడ్డి అనే మరో వ్యక్తిపై ఈడీ దాడులు చేయడం... ఫెమా కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది.
సైదాబాద్ వినయ్ నగర్ కాలనీ లో నివాసం ఉండే చికోటి ప్రవీణ్ మొదట పేకాట శిబిరాలు నిర్వహించేవారు. నగర శివార్లలోని ఫార్మ్ హౌస్ లో ప్రముఖులతో పేకాట శిబిరాలు ేర్పాటు చేసేవారు. అయితే అవి ధనవంతులకు మాత్రమే. చికొటి నిర్వహించే పేకాటలో...టేబుల్ ప్రారంభమే 25 లక్షలతో ప్రారంభమవుతాయని చెబుతారు. పలుమార్లు ఈ కేసుల్లో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కేసినో మీద దృష్టి పెట్టారు. పలుస్టార్ హోటళ్లలో రహస్యంగా కేసినోలు నిర్వహించారు. ఈ అంశంపైనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది.
ఆ తర్వాత గోవా,నేపాల్,శ్రీలంక,ఇండోనేషియా, బ్యాంకాక్ లలో క్యాసినో కంపెనీలతో సంబంధాలు పెట్టుకున్నారు. గోవా లోని " బిగ్ డ్యాడీ " క్యాసినో లో చీకోటి పార్టనర్ అనే ప్రచారం ఉంది. " బిగ్ డ్యాడీ " క్యాసినో గోవా లో ఫేమస్...ఇధి షిప్ లో నిర్వహించే క్యాసినో. గతం లో నేపాల్ లో నిర్వహించిన క్యాసినో కు తెలంగాణ,ఆంధ్రా కు చెందిన ప్రముఖులను స్పెషల్ ఫ్లైట్ లో తీసికెళ్ళి క్యాసినో ఆడించినట్టు ఈ డీ వద్ద సమాచారం ఉండటంతో సోదాలు చేస్తున్నారు. మొత్తం ఎనిమిది చోట్ల జరుగుతున్న సోదాల్లో కాసినో సామ్రాజ్యానికి చెందిన వివరాలకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
చికోటి ప్రవీణ్ అపార్టుమెంట్‌లోనే నివసిస్తున్నప్పటికీ అత్యంత ఆర్భాటంగా జీవిస్తూంటారు. లావిష్ లైఫ్ స్టైల్ పాటిస్తూంటాు. నెల రోజుల క్రితం చంపాపేట లోని సామ సరస్వతి గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా చీకోటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు పలువురు మంత్రులు,ఎమ్మెల్యే లు, పోలీస్ ఉన్నతాధికారులు , జైళ్ల శాఖ కు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారని తెలుస్తోంది.