Shadnagar Crime : హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ, మర్డర్ ప్లాన్ లో హెడ్ కానిస్టేబుల్ హస్తం!
Shadnagar Crime : హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన కేసును షాద్ నగర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ హస్తం కూడా ఉండడం మరో ట్విస్ట్.
Shadnagar Crime : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో మొగలిగిద్ద గ్రామ శివారులో డిసెంబర్ 22న ఓ వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన మిస్టరీని షాద్ నగర్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లో ఉంటున్న శ్రీకాంత్ తన వద్ద పనికి వచ్చే వారి పేరుపై క్రెడిట్ కార్డులు, లోన్లు తీసుకుని జల్సాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇదే తరహాలో రూ.1.5 కోట్లు మోసం చేసినట్లు రాచకొండ పరిధిలో కేసు నమోదు అయింది. శ్రీకాంత్ దగ్గర పని చేసేందుకు వచ్చిన భిక్షపతి అనే వ్యక్తి పేరుపైన శ్రీకాంత్ ICICI బ్యాంకులో రూ.50 లక్షల ఇన్సూరెన్స్ తీసుకుని నామినిగా తన పేరు పెట్టుకున్నాడు. 2021 ఫిబ్రవరిలో మేడిపల్లి పరిధిలో ఇల్లు కొని భిక్షపతి పేరుపై ఇన్సూరెన్స్ చేయించాడు. తన పేరు మీద తీసుకున్న ఇల్లును అమ్మకానికి భిక్షపతి ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా భిక్షపతిని తప్పించి ఇల్లుతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయలని పథకం పన్నాడు శ్రీకాంత్. ఉపాయం కోసం ఎన్వోటీ మల్కాజిగిరిలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మొతిలాల్ ను సాయం కోరి రూ.10 లక్షలు ఇస్తానని మాటిచ్చాడు. అలాగే సాయం చేస్తే సతీష్, సమ్మయ్యలకు చెరో రూ.5 లక్షలు ఇస్తానని చెప్పాడు. నలుగురూ పథకం ప్రకారం భిక్షపతిని కారులో ఎక్కించుకుని బాగా మద్యం తాగించి షాద్ నగర్ పరిధిలో మొగలిగిద్ద గ్రామ సమీపంలో హాకీ స్టిక్ తో కొట్టి అనంతరం కారుతో తొక్కించి చంపి యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మీడియాతో తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు షాద్ నగర్ పోలీసులు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులకు రివార్డ్ అందించారు.
తాయత్తు కట్టిన బాబాపై హత్యాయత్నం
ఆరోగ్యం కోసం తాయత్తు కట్టించుకొని ఆరోగ్యం కుదుట పడలేదని కక్ష పెంచుకుని హత్యాయత్నానికి పాల్పడీ కటకటాల పాలయ్యాడో వ్యక్తి. అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి దర్గా వద్ద బాబా చేత తాయత్తు కట్టించుకుంటే దాని మహిమతో ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశపడ్డాడు. తన ఆరోగ్యం కాస్త కుదుట పడకపోవడంతో తాయత్తు కట్టిన బాబాపై పెట్టుకున్నా నమ్మకం కాస్త వికటించి తాయత్తు కట్టిన బాబానే తనకు ఏదో చేశాడని అపనమ్మకంలో బాబాను హతమార్చే కుట్రలో కటకటాల పాలైన సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి పట్టణానికి చెందిన సయ్యద్ నౌషాద్(57) గత 20 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుర్రంకొండ మండలం బాబా బుడెన్ కొండ(కుక్క రాజు గుట్ట) వద్ద ఉన్న మస్తాన్ వల్లీ దర్గాలో బాబా మదార్ ఖాన్ వద్ద తన ఆరోగ్యం కోసం సయ్యద్ నౌషాద్ తాయత్తు వేయించుకున్నాడు. అయితే సయ్యద్ నౌషాద్ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింతగా క్షీణించింది. దీంతో బాబా మదార్ ఖాన్ పై అనుమానం పెంచుకొని అతన్ని హత మార్చేందుకు కుట్ర పన్నాడు సయ్యద్ నౌషాద్. జనవరి 6న సయ్యద్ నౌషాద్ తో పాటు చిత్తూరుకు చెందిన అంబికా పతి ఆనంద్, అబ్దుల్, వర్ధన్ మురుగన్, పూర్ణచంద్ర, అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన తాహిర్ లతో కలసి బాబా మదర్ ఖాన్ ను హతమార్చేందుకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ఓ పల్లె సమీపంలో మదర్ ఖాన్ ను కొడవళ్లతో హతమార్చేందుకు వెంటపడ్డారు. ప్రాణభయంతో అరుస్తూ పరుగులు తీశాడు బాబా మదార్ ఖాన్. అయితే అదే సమయంలో సమీపంలో పొలాల్లో పని చేస్తున్న రైతులను చూసి హంతకులు అక్కడ నుంచి పారిపోయారు. మదర్ ఖాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గుర్రంకొండ ఎస్సై దిలీప్ విచారణలో భాగంగా ఇవాళ తంబళ్లపల్లె మండలం యడంవారిపల్లె నుంచి కోటకొండకు వెళ్లే దారిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని విచారించగా అసలు విషయం తెలిసిందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వాల్మీకిపురం కోర్టుకు తరలించినట్లు రాయచోటి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.