Road Accidents: మేడ్చల్‌లో కారు బోల్తా, లోపల 9 మంది - నల్గొండ యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి
Nalgonda Accident: నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం తోగార్రాయి శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
తాగిన మైకంలో వాహనం నడపడం వల్ల హైదరాబాద్‌లో (Hyderabad Accident) మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే మద్యం మత్తులో బండి నడపడం వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగిందో గతంలో అనేక ఘటనలు చాటాయి. తాజాగా మేడ్చల్ (Medchal Accident) జిల్లాలోనూ మద్యం మత్తులో వాహనం నడపటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద నేషనల్ హైవేపై మంగళవారం రాత్రి వేళ చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు రోడ్డు మధ్యలోని డివైడర్ పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెప్పారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు (Hyderabad Police) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కారు నడుపుతున్న డ్రైవర్ ఫూటుగా తాగి ఉండగా.. వాహనం అదుపుతప్పి చెక్ పోస్ట్ బావర్చి హోటల్ దగ్గర డివైడర్ పైకి దూసుకెళ్లింది. అతి వేగంగా రామాయంపేట్ నుంచి నగరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల పేర్లు, వివరాలు తెలియాల్సి ఉంది. మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నల్గొండ జిల్లాలోనూ మరో ప్రమాదం
నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం తోగార్రాయి శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైక్‌లు పరస్పరం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు కోదాడ పట్టణం తమ్మరబండ పాలెంకు చెందిన 20 ఏళ్ల అంజద్, 22 ఏళ్ల బొమ్మకంటి అరవింద్‌గా గుర్తించారు. మరో ఇద్దరు మైసయ్య, అనిల్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేళ్లచెర్వు జాతరకు బైక్‌పై ముగ్గురు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డ యువకుడు
అతి వేగంతో ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సాలార్‌జంగ్ కాలనీకి చెందిన సర్పరాజ్ హుస్సేన్(18) అదే కాలనీలో ఓ మెడికల్ షాప్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి బుల్లెట్‌పై టోలీచౌకి వంతెన మీదుగా షేక్‌పేట వెళ్తున్నాడు. వేగంతో వెళ్తూ అదుపుతప్పి ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడ్డాడు. హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. బుల్లెట్ బైక్ నుజ్జునుజ్జయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు హుటాహుటిన స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గోల్కొండ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.