Students Drown : ఈత సరదా ప్రాణం తీసింది, తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు చిన్నారులు మృతి!
Students Drown : హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
Students Drown : హైదరాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈతకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గచ్చిబౌలి టెలికాం నగర్ కు చెందిన ముగ్గురు పిల్లలు మధ్యాహ్నం ఈతకని వెళ్లి నానక్ రాంగూడ పటేల్ కుంటలో మునిగిపోయారు. మృతి చెందిన చిన్నారుల వయసు దాదాపు 12 సంవత్సరాలలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు షాభాజ్ (15) దీపక్ (12) పవన్ (13) గా పోలీసులు గుర్తించారు.
ఈత రాకపోవడంతో
గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ఓ స్కూల్ లో చదువుకుంటున్న తొమ్మిది మంది విద్యార్థులు నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ కోర్స్ సమీపంలోని చెరువులో ఈతకు దిగారు. వారిలో ముగ్గురు చెరువు లోతు గమనించకుండా దిగడంతో నీటిలో మునిగిపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన తోటి విద్యార్థులు అటుగా వెళ్లేవారిని సాయం కోరడంతో వారు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే విద్యార్థులు మృత్యువాత పడ్డారు. స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం తర్వాత విద్యార్థుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. దీంతో గచ్చిబౌలి టెలికాంనగర్ విషాదఛాయలు అలముకున్నాయి. ఈతరాకపోవడంతో విద్యార్థులు మునిగిపోయారని తోటి విద్యార్థులు అంటున్నారు. లోతు తెలియని గుంతల్లో పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు చెరువులు, లోతైన గుంతల వైపు రాకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు.
వన సమారాధనకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా మడిపల్లి పాఠశాల విద్యార్థులు పెనుగంచిప్రోలు వన సమారాధనకు వచ్చారు. టీచర్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఇద్దరు విద్యార్థులు మునేటిలో ఈతకు దిగి ఊబిలోకి చిక్కుకొని మృతి చెందారు. మృతులు శీలం నర్సిరెడ్డి(13), నీలం జస్వంత్(10)గా గుర్తించారు. జాలర్ల సహాయంతో మృతదేహాలను బయటికి తీశారు.
భీమిలి బీచ్ లో విషాదం
విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో ఈతకు దిగిన సాయి(20), వేముల సూర్యవంశీ (19) అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరద్దరూ తగరపువలస అనిల్ నీరుకొండ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. విశాఖలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరిద్దరితో స్నేహితులతో కలిసి శుక్రవారం కళాశాలకు వెళ్లకుండా సరదాగా గడిపేందుకు భీమిలి బీచ్‌కు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏడుగురు సముద్రంలో ఈతకు దిగారు. వీరిలో సాయి, వంశీ, మణికంఠ కొద్దిగా ముందుకు వెళ్లగా అలల ఉద్ధృతికి సాయి, వంశీ కొట్టుకుపోయారు. మరో విద్యార్థి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విద్యార్థుల గల్లంతు సమచారం అందుకున్న సీఐ లక్ష్మణమూర్తి తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మత్స్యకారులు బోట్లు, ఐఎన్‌ఎస్ కళింగ నావికాదళ మెరైన్ కమాండోలు స్పీడ్ బోట్లతో, ఇండియన్ కోస్టు గార్డుకు చెందిన రెండు హెలికాప్టర్లు గల్లంతైన విద్యార్థుల కోసం సాయంత్రం వరకు గాలించారు. అయినా వారి ఆచూకీ లభించలేదు.