Chikoti Casino Case : కేసినో కేసులో ఏడుగురికి ఈడీ నోటీసులు - పట్టించేసిన రూ. కోట్ల లావాదేవీలు !
కేసినో కేసులో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో అత్యధికం హవాలా ఆపరేటర్లే ఉన్నారు.
Chikoti Casino Case : తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన కేసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. మొత్తం ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. వారంతా సోమవారం తమ ఎదుట హజరు కావాలని స్పష్టం చేసింది. ఏడుగురిలో మొదటి వ్యక్తి చీకోటి ప్రవీణ్ కాగా.. రెండో వ్యక్తి మాధవరెడ్డి, మూడో వ్యక్తి సంపత్. మిగతా నలుగురు హవాలా ఆపరేటర్లు. చీకోటి ప్రవీణ్‌తో పాటు మరో ముగ్గురు లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లను పరిశీలించిన ఈడీ మొత్తంగా రూ. పాతిక కోట్ల లావాదేవీలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆ నగదు అంతా ఎక్కడి నుంచి వచ్చింది..? ఎలా వచ్చింది ? ఎలా మార్పిడి చేశారు ? వంటి అంశాలపై ఈడీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
రూ. పాతిక కోట్లకుపైగా అక్రమ నగదు చెలామణి చేసినట్లుగా ఈడీకి ఆధారాలు ?
చీకోటి ప్రవీణ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కంప్యూటర్ ఇతర ఆధారాలను సాంకేతికంగా విశ్లేషించిన తర్వాత పెద్ద ఎత్తున కేసినో నిర్వహణ, హవాలా లావాదేవీలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక ఆధారాలు లభించడంతో చీకోటి ప్రవీణ్‌తో పాటు మాధవరెడ్డి, సంపత్, ఇతర హవాలా ఆపరేటర్ల దగ్గర నుంచి మరిన్ని వివరాలు రాబట్టి... హవాలా ద్వారా నగదు చెలామణి చేసిన వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీరంతా ప్రస్తుతానికి కేసినోలు.. హవాలాకు పాల్పడిన వారే. అలా వ్యవహరించి కమిషన్లు పొందారు. కానీ అసలు డబ్బులు చెలామణి చేసిన వారిలో ఎక్కువ మంది పంటర్లు ఉన్నారు.
డబ్బులు ఎవరివి ? ఎలా మార్చారు అన్నదానిపైనే ప్రధానంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ ?
కేసినోలకు అలవాటు పడిన ప్రముఖులు.. రాజకీయ నేతలు.. సంపన్నులు చీకోటి ప్రవీణ్ ద్వారా గోవా, నేపాల్, బ్యాంకాక్ కేసినోలకు వెళ్లేవారు. వారు ఇక్కడ నగదు రూపంలో లక్షలు చీకోటి ప్రవీణ్ అతని ఏజెంట్లకు చెల్లిస్తే.. వారు ఏ దేశానికి వెళ్తారో ఆ దేశం కరెన్సీని కమిషన్ మినహాయించుకుని సమకూరుస్తారు. ఇలా కరెన్సీ కంటే ఎక్కువగా వారు కేసినోలో ఆడే కాయిన్స్ ఇస్తారని చెబుతున్నారు. తర్వాత అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకునే సమస్య ఉండదు. ఏదైనా కొద్దిగా గెల్చుకుంటే...వాటిని వైట్ మనీగా ఇండియాకు చేర్చే బాధ్యతను కూడా చీకోటి ప్రవీణ్ తీసుకుంటారని చెబుతున్నారు. దానికీ కమిషన్ పొందుతాడని అంటున్నారు.
ప్రవీణ్ కస్టమర్ల జాబితా గుట్టు వీడితో సంచలనాలే !
కేసినో చట్టబద్దమా.. కాదా అన్నది ఈడీ ఇప్పుడు దర్యాప్దు చేస్తున్న అంశం కాదు. కేసినో పేరుతో జరిగిన హవాలా లావాదేవీలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఫెమా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘించినట్లుగా ఈడీ అధికారులకు ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. ఈ అంసంలో సోమవారం నుంచి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.