Crime News: తాగిన మైకంలో డెలివరీ బాయ్‌ను ఘోరంగా కొట్టిన యువకులు
Crime News: తాగిన మైకంలో ఫుడ్ డెలివరీ బాయ్ ను విపరీతంగా కొట్టారు కొందరు యువకులు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Crime News: వాళ్లంతా యువకులు. తప్ప తాగారు. ఆ మైకంలోనే నడి రోడ్డుపైకి వచ్చారు. ముగ్గురు బృందంగా ఏర్పడి రోడ్డుపైకి వచ్చారు. తాగిన మైకంలో విచక్షిణారహితంగా ప్రవర్తించారు. అడ్డు వచ్చిన వారిని కూడా పట్టించుకోలేదు. డెలివరీ బాయ్‌గా చేస్తున్న ఓ యువకుడిపై తమ ప్రతాపం చూపించారు. ఒక్కడిని చేసి ముగ్గురు కలిసి దాడి చేశారు. నడిరోడ్డు అని కూడా చూడకుండా ఆ డెలివరీ బాయ్‌తో ఘర్షణకు దిగారు. అతడు ఒక్కడు, మేము ముగ్గురం ఏం చేయగలడు అనుకున్నారేమో.. పైపైకి ఎగురుతూ ఆ డెలివరీ బాయ్‌ను ఇష్టారీతిగా కొట్టారు. కిక్ బాక్సింగ్ తరహాలో పిడి గుద్దులు కురిపించారు. ఎగురుతూ, దుంకుతూ పిడికితో డెలివరీ బాయ్ పై దాడి చేశారు.
తప్పతాగి డెలివరీ బాయ్ ను కొట్టారు..
ఈ ఘటన హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు తాగిన మైకంలో ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేస్తుండటం చూసిన మరో డెలివరీ బాయ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. వారిని వారించి తన తోటి డెలివరీ బాయ్ ను కాపాడటానికి యత్నించగా.. తాగిన మైకంలో ఉన్న ఆ ముగ్గురు యువకులు.. అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తిపైనా దాడి చేశారు. ఇష్టారీతిగా కొట్టారు.
ఆ యువకులు మరీ మృగాళ్ల లాగా దాడి చేస్తుండటంతో స్థానికులు కూడా వారిని ఆపేందుకు భయ పడ్డారు. క్రమంగా స్థానికులు పెరగడంతో ఆ ముగ్గురు యువకులు భయ పడ్డారు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పరుగు అందుకున్నారు. డెలివరీ బాయ్ ను కొందరు యువకులు తాగొచ్చి భవానీ నగర్ చౌరస్తాలో కొడుతున్నారని తెలియగానే డెలివరీ బాయ్స్ అక్కడికి చేరుకున్నారు. పారిపోతున్న ఆ ముగ్గురు యువకులను వెంటాడి మరీ పట్టుకున్నారు.
తీవ్రంగా గాయపడ్డ డెలివరీ బాయ్..
స్థానిక పోలీస్ స్టేషన్‌లో తాగిన మైకంలో ఉండి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డ ఆ యువకులను పోలీసులకు అప్పగించారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడ్డ డెలివరీ బాయ్ కిరణ్ ని చికిత్స నిమిత్తం పోలీసులు ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తప్ప తాగి డెలివరీ బాయ్ ను కొట్టిన ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు చైతన్య పురి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుల్లో ఇద్దరు ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు..
దాడికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఘర్షణ పడుతున్న సమయంలో పక్కనే ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలను సేకరించిన పోలీసులు.. కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువకుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.