Chittoor News: బట్టల దుకాణంలో దొంగతనం కేసు... సస్పెండ్ అయిన ఏఎస్సై గుండె పోటుతో మృతి...
పోలీసులే దొంగలుగా మారి బట్టల దుకాణంలో దొంగతనం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనకు పాల్పడిన ఏఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ లో ఉన్న ఏఎస్సై మృతి చెందారు.
ఇటీవల చిత్తూరు జిల్లాలో బట్టల దుకాణంలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్ఐ మహమ్మద్(సస్పెండెడ్) మృతి చెందారు. ఈ నెల 4న బట్టల దుకాణంలో దొంగతనం చేసిన సీసీ కెమెరా దృశ్యాలు వెలుగుచూశాయి. ఈ కేసులో మరో కానిస్టేబుల్‌తో పాటు ఏఎస్ఐ అరెస్టయ్యారు. ఎస్పీ అదేశాలతో దొంగతనం కేసులో ఏఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్‌కు తరలించారు. అయితే బుధవారం జైలులో మహమ్మద్‌కు గుండెపోటు రావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహమ్మద్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది
పోలీసులే దొంగల అవతారమెత్తి కొద్ది రోజుల క్రితం చిత్తూరు కలెక్టరేట్ రోడ్ లోని ఒక వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలించారు. కానీ అక్కడి సీసీ కెమెరాకు చిక్కారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు కొందరు ప్రయత్నించినా బట్టల దుకారణం వ్యాపారి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో ఒమిని వ్యానులో దుస్తుల వ్యాపారాన్ని చేస్తున్నారు. రోజూ పని ముగించుకుని దుస్తులు అన్నీ మూటగట్టి ఆ వ్యాన్ వద్ద పెట్టి వెళ్లేవాడు. అదే విధంగా ఇటీవల మూట గట్టి వెళ్లి మరుసటిరోజు వచ్చి చూసేసరికి స్టాక్ తక్కువగా ఉందని గుర్తించాడు.
Also Read: Nusrat Jahan : తన బిడ్డకు తండ్రెవరో చెప్పేసిన ఎంపీ నుస్రత్ ! పెళ్లి చేసుకోకుండానే ...
సీసీ కెమెరాకు చిక్కారు
అక్కడ అమర్చిన సీసీ కెమెరాను పరిశీలించాడు వస్త్ర వ్యాపారి. దీంతో అసలు విషయం బయట పడింది. పోలీసులే దొంగలుగా మారి బట్టలు కొట్టేశారని గుర్తించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజీలో కానిస్టేబుల్ దుస్తులు దొంగలించడాన్ని గుర్తించారు. అతనితో పాటు సివిల్ డ్రెస్‌లో ఏఎస్‌ఐ కూడా అక్కడే ఉన్నది సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డైంది. ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేయడంతో దొంగలుగా మారిన పోలీసులు దొరికిపోయారు. ద్విచక్ర వాహనంలో వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా, సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐ మహమ్మద్‌గా గుర్తించిన పై అధికారులు వారిని సస్పెండ్ చేశారు.