Chittoor Crime News: కార్టూన్ ఛానల్ చూస్తూ ఉరేసుకునే ఆట ఆడాడు, ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు!
Chittoor Crime News: చిత్తూరు జిల్లా విషాధం చోటు చేసుకుంది. ఇంట్లో ఆడుకుంటూ ఓ ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కార్టూన్లు చూస్తూ కిటీకికి ఉన్న తాడును మెడకు కట్టుకోవడంతో బిగుసుకుపోయి చనిపోయాడు.
Chittoor Crime News: ఈ మధ్య కాలంలో ప్రతీ ఒక్క పిల్లాడు ఫోన్ తోనే ఉంటున్నాడు. ఫోన్ లో బొమ్మలు చూపిస్తేనే అన్నం తింటున్నారు. అల్లరి చేయకుండా కూర్చుంటున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా బాలుడికి కార్టూన్లు చూడడం అలవాటు చేశారు. అయితే బాలుడు అందులో చేస్తున్న మాదిరిగానే చేయడం వంటివి చేసేవాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. బాలుడు ప్రాణాలు కోల్పోయేలా చేసింది.
చిత్తూరు జిల్లా కైలాసపురం కస్తూరీ నగర్ లో విషాధం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల సూర్య అనే బాలుడు... ఇంట్లో ఆడుకుంటున్నాడు. కిటీకీ పైనున్న ఎలక్ట్రిక్ పైపుకు తాడును కట్టాడు. ఆపై దాన్ని మెడకు తగిలించుకొని ఆడుకున్నాడు. తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉండి.. బాలుడిని గమనించలేదు. ఇంతలోనే ఆ తాడు బాలుడి మెడకు బిగుసుకొని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. విషయం గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
"అమ్మా.. చనిపోయే ఆటాడుకుంటా"
అయితే బాలుడు ఆడుకుంటూనే ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాలుడు ఎక్కువగా కార్టూన్లు చూస్తాడని, అందులో చూపించినట్లుగా చేస్తాడని అంటున్నారు. గతంలో కూడా ఓసారి ఇలాగే మంచానికి తాడు కట్టి మెడకు చుట్టుకున్నాడని.. కానీ విషయం గుర్తించిన తాను తాడు విప్పి బాబును మందలించినట్లు బాలుడి తండ్రి చెబుతున్నాడు. చనిపోయే ఆట ఆడుకుంటానంటూ బాబు తరచుగా తల్లితో చెప్పాడని, దానికా తాను బాలుడిని తీవ్రంగా మందలించి కొట్టినట్లు ఆమె తల్లి చెప్పింది. కానీ అదే ఆటతో బాబు ప్రాణాలు కోల్పోతాడని ఎప్పుడూ అనుకోలేదని విలపిస్తోంది.
యూట్యూబ్ లో చూస్తూ ఉరేసుకున్న బాలుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో ఇటీవలే దారుణం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 11 ఏళ్ల ఉదయ్ కుమార్ అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడికి తల్లిదండ్రుల సెల్ ఫోన్ లో వీడియోలు చూసే అలవాటు ఉంది. రోజూలాగే ఆ రోజు రాత్రిపూట భోజనం చేశాడు. అనంతరం ఫోన్ తీసుకొని ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. విషయం గుర్తించని తల్లిదండ్రులు భోజనం చేసి ఇతర పనులు చేసుకున్నారు. బాలుడు చాలా సేపు అవుతున్నా బయటకు రాకపోవడంతో.. తల్లిదండ్రులు చాలా సేపు పిలిచారు. అయినప్పటికీ చడీచప్పుడు లేకపోవడంతో తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఉదయ్ ఉరి వేసుకొని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అది చూసిన తల్లిదండ్రులకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా కేకలు వేస్తూ ఏడ్వడంతో స్థానికులంతా వచ్చారు. తలుపులు పగులగొట్టి బాలుడిని నేరుగా ఆస్పత్రికి తరలించారు.
మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే స్థానికులు పోలీసులకు కూడా సమాచారం అందించగా.. హుటాహుటాన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం ఉదయ్ మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.