Bhadradri Kothagudem: విషాదంగా మారిన జంతువుల వేట - ఒకరు కరెంట్ షాక్‌తో ! భయంతో మరో వ్యక్తి మృతి
Hunter Death In Bhadradri Kothagudem: వన్యప్రాణులను వేటాడేందుకు తుపాకీతో బయలు దేరిన ఆ వ్యక్తి వేరే వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాతపడ్డాడు. ఇది భద్రాద్రి జిల్లాలో సంచలనంగా మారింది.
Bhadradri Kothagudem Hunter Dies: జంతువులను వేటాడే ఆ వ్యక్తి చివరకు జంతువుల వేటకు బిగించే విద్యుత్ ఉచ్చుకు బలైపోయాడు. వన్యప్రాణులను వేటాడేందుకు తుపాకీతో బయలు దేరిన ఆ వ్యక్తి వేరే వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాతపడ్డాడు. విషయం పోలీసుల వద్దకు చేరడంతో మృతదేహం మాయం కావడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
వేటకు వెళ్లి కరెంట్ షాక్‌తో..
కొత్తగూడెంలోని సన్యాసీబస్తీకి చెందిన మల్లెల సునీల్‌కుమార్, పాత కొత్తగూడెంకు చెందిన వెంకయ్య, రుద్రంపూర్‌కు చెందిన లావుడ్యా మున్నాలాల్ గత కొద్ది రోజులుగా పెనుబల్లి అటవీ ప్రాంతంలో తుపాకులతో వన్యప్రాణులను వేటాడుతున్నారు. అదే విధంగా అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు పెనుబల్లి అటవీప్రాంతానికి వెళ్లారు. అయితే వన్యప్రాణులను వేటాడుతున్న మరో గ్రూప్ వ్యక్తులు విద్యుత్ వైర్లను అమర్చారు. ఈ విషయాన్ని గమనించకుండా ముందుకు వెళుతున్న వెంకయ్య విద్యుత్ వైర్‌ను తాకాడు. వెంకయ్య కిందపడిపోతుండటంతో ఆయనను కాపాడేందుకు సునీల్‌కుమార్ పట్టుకునేందుకు ప్రయత్నించి విద్యుత్ వైర్‌పై పడిపోయాడు. దీంతో కరెంట్ షాక్‌తో సునీల్‌కుమార్ మృతి చెందాడు. తమతో వేటకు వచ్చిన వ్యక్తి కరెంట్‌షాక్‌తో మృతి చెందడంతో ఆందోళన చెందిన వెంకయ్య, మున్నాలాల్‌లు బయటకు వచ్చి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు విషయం ఉన్నతాధికారులకు అందించి డాగ్ స్క్వాడ్‌ను తెప్పించి అడవిలో గాలింపు చేపట్టారు.
మృతదేహం మాయం..
పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకున్న సమయానికి సునీల్‌కుమార్ మృతదేహం సంఘటన స్థలం వద్ద మాయం కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, ట్రైనీ ఐపీఎస్ క్రాంతిలాల్‌పాటిల్ వెంకయ్య, మున్నాలాల్‌ను విచారించారు. అనంతరం విద్యుత్ ఉచ్చు అమర్చిన వాళ్లే మృతదేహాన్ని మాయం చేశారనే అనుమానంతో కొందరు అనుమానితులను విచారణ ప్రారంబించారు. పెనుబల్లి మండలానికి చెందిన ముగ్గురు వేటగాళ్లపై అనుమానితులుగా బావించి వారిని విచారణ చేశారు.
విచారణ భయంతో ఆత్మహత్య..
సునీల్‌కుమార్ మృతదేహం మాయం అయిన సంఘటనపై పోలీసులు పెనుబల్లికి చెందిన చంటి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ భయంతో చంటి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగడంతో గమనించిన పోలీసులు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంటి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వన్యప్రాణులను వేటాడే విషయంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది.
Also Read: Hyderabad Crime : హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్, ఆటో ఎక్కిన యువతిపై ముగ్గురు అత్యాచారం!
Also Read: Chittoor Crime : వయసులో చిన్న వాడితో అక్రమ సంబంధం, మహిళ ప్రాణం మీదకు తెచ్చింది?