Andhra Pradesh: టమోటా ట్రేల మధ్య ఎర్రబంగారం.. మరో కిలోమీటరు దాటితే సేప్ అనుకున్నారు.. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది
పక్కాగా ప్లాన్ చేశారు. అంతా సవ్యంగానే సాగుతుందనుకున్నారు. అనుకున్న విధంగానే టమోటా ట్రేల మధ్య ఎర్ర చందనం దుంగలు ఉంచి రవాణాకు సిద్ధం చేశారు. కానీ పోలీసులు స్మార్ట్ మూవ్ తో సీన్ రివర్సైంది…
కొంచెం ఆలస్యం అయి ఉంటే ఎర్ర బంగారం బోర్డర్ దాటేది. అనుమానం వచ్చిన పోలీసులు ఐచర్ వాహనాన్ని వెంబడించడంతో స్మగ్లర్లు పట్టుబడ్డారు. భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమరవాణా కట్టడికి ఏడాది పొడవునా కూబింగ్ సాగిస్తుంటారు. జిల్లా నలువైపులా ఉన్న చెక్ పోస్టుల్లో తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. ఎంత నిఘా పెట్టినా ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆపలేక పోతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా…అక్రమార్కులు మాత్రం రోజుకో స్కెచ్ తో రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ పై సమాచారం అందుకున్న పోలీసులు కేవి పల్లె పోలీసు స్టేషన్ పరిధిలో నూతన కాలువ అటవీ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండగా…. అత్యంత వేగంగా వస్తోన్న ఐచర్ వ్యాన్ ని గమించిన వాహనం ఆపేందుకు ప్రయత్నించారు పోలీసులు. తగ్గేదే లే అంటూ దూసుకుపోయాడు డ్రైవర్. ఎప్పుడైతే ఆపినా ఆగకుండా తప్పించుకుని దూసుకుపోతున్నాడో అప్పుడే పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే వాహనాన్ని వెంబడించారు. దాదాపుగా నాలుగు కిలో మీటర్ల వరకూ పోలీసు వాహనాలకు దారి ఇవ్వకుండా ఐచర్ డ్రైవర్ వాహనాన్ని నడిపాడు. ఎట్టకేలకు వాహనాన్ని ఓవర్ టాక్ చేసిన పోలీసులు ఆపి డ్రైవర్ తో పాటూ వాహనంలో ఉన్న 23 మంది ఎర్ర కూలీలను, ఒక క్లీనర్ ను, మేస్త్రి ని అదుపులోకి తీసుకున్నారు.
వాహనం మొత్తం తనిఖీ చేశారు.పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాకుండా క్రింది భాగంలో దుంగలను పరిచి వాటిపై టమోటా ట్రేలు ఉంచారు. గుర్తించిన పోలీసలు టమోటా ట్రేల మధ్య దాదాపు కోటిరూపాయల విలువ చేసే 41 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం కూలీలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. వీరంతా తమిళనాడు రాష్ట్రానికి చేందిన వారుగా గుర్తించారు. ఇందులో మరో పది మంది స్మగ్లర్స్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలో వారిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపుతామని వాయల్పాడు సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు.
ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా... ఎందరిని అరెస్టు చేస్తున్నా ఎర్ర చందన దొంగలు మాత్రం భయపడటం లేదు. వ్యవస్థల్లోని లోపాలను, లంచాలకు అలవాటు పడిన అధికారులను లోబరుచుకొని పని కానిచ్చేస్తున్నారు. కొన్ని సార్లు దొరుకుతున్నా... ఎంతో కాలం జైల్లో ఉండటం లేదు. మళ్లీ బయటకు వచ్చి వ్యాపారం మొదలు పెడుతున్నారు. నిత్యం ఏదో చోట దుంగలు దొంగలు దొరుకుతూనే ఉన్నారు.