![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: ఏపీలో యాసిడ్ దాడి ఘటనలు - ప.గో జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడికి యత్నం, విశాఖలో ఆర్టీసీ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి!
Acid Attacks: ఏపీలో యాసిడ్ దాడి ఘటనలు కలకలం రేపాయి. ప.గో జిల్లాలో ఓ యువకునిపై యువతి యాసిడ్ దాడికి యత్నించగా.. విశాఖలోని ఆర్టీసీ బస్సులో ముగ్గురు మహిళలపై దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.
![Crime News: ఏపీలో యాసిడ్ దాడి ఘటనలు - ప.గో జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడికి యత్నం, విశాఖలో ఆర్టీసీ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి! acid attack incidents in west godavari and visakha districts Crime News: ఏపీలో యాసిడ్ దాడి ఘటనలు - ప.గో జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడికి యత్నం, విశాఖలో ఆర్టీసీ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/30/e014a418a556ae62b55967a0e882c7161732982757818876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Acid Attack Incidents In AP: ఏపీలో యాసిడ్ దాడి ఘటనలు కలకలం రేపాయి. ప్రేమించిన యువతి మోసం చేసిందని యువకులు ఉన్మాదులుగా మారడం, యాసిడ్ దాడి చేయడం, కత్తులతో దాడి చేయడం వంటి ఘటనలు చూశాం. అయితే, ఓ యువతి తనతో సహజీవనం చేసిన యువకునిపైనే యాసిడ్ దాడికి యత్నించిన ఘటన ప.గో జిల్లాలో (Westgodavari District) చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా పాలకోడేరుకు (Palakoderu) చెందిన జయకృష్ణ అనే యువకుడు భీమవరం, రాజమండ్రి, నర్సాపురం షాపుల్లోని పలు దుస్తుల షాపుల్లో సేల్స్ మెన్, మేనేజర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలోనే విజయవాడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితి బాగోలేదని పలు దఫాలుగా రూ.2.40 లక్షలు అప్పుగా ఇచ్చానని.. అవి తిరిగి అడిగినందుకు యువతి తనపై యాసిడ్ దాడికి యత్నించిందని పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు
అయితే, జయకృష్ణే తనపై అత్యాచారం చేశాడని సదరు యువతి విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బురఖా వేసుకుని యువతే తనపై యాసిడ్ దాడికి యత్నించిందని.. తాను తప్పించుకున్నానని జయకృష్ణ పాలకోడేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.
బస్సులో మహిళలపై
మరోవైపు, విశాఖలోని (Visakha) ఆర్టీసీ బస్సులో శుక్రవారం రాత్రి మహిళలపై యాసిడ్ దాడి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచరపాలెం పీఎస్ పరిధిలోని ఐటీఐ జంక్షన్ వద్ద గిరిజాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌తో దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర మంటలతో మహిళలు కేకలు వేయగా వెంటనే బస్సును ఆపిన డ్రైవర్ స్థానికుల సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆర్టీసీ బస్సు నిలిచిపోగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. యాసిడ్ దాడి జరిగిందా లేక మరేదైనా ద్రావణమా అనే కోణంలో విచారిస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)