(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Crime News : రూ. 7 కోట్ల విలువైన నగలు, ఖరీదైన కారు - ఆ డ్రైవర్ అవకాశం అనుకున్నాడు .. అంతే !
ఏడు కోట్ల విలువై నగలతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది.
Hyderabad Crime News : అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలని ఆ డ్రైవర్ ఎక్కడో చదువుకున్నట్లుగా ఉన్నాడు... తనకు కళ్ల ముదు కనిపించిన నగలు అవకాశమే అనుకుని అందుకుని జంప్ అయ్యాడు. అతను తీసుకెళ్లిపోయింది ఒకటి..రెండు లక్షల నగరు కాదు.. ఏకం ఏడు కోట్ల విలువైన డైమండ్ నగలు. ఇప్పుడు అతని కోసం పోలీసులు తీవ్రంగా వెదుకుతున్నారు.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ మాదాపూర్‌లోని మైహోం భూజ అపార్టుమెంట్‌లో నివాసం ఉండే.. రాధిక అనే యువతి నగల డిజైనింగ్ వ్యాపారం చేస్తారు. డిజైనర్‌గా హై సర్కిల్స్‌లో పేరున్న ఆమెకు.. అనూష అనే మహిళ రూ., యాభై లక్షల విలువైన నగలు ఆర్డర్ ఇచ్చారు. అయితే అనూష తన బంధువులకు ఆ నగలు డెలివరీ ఇవ్వమన్నారు. దీంతో నగలు ఇచ్చి.. తన సేల్స్ మెన్ అక్షయ్ ను కారులో పంపారు. అనూష బంధువుల ఇల్లు ఎస్సార్ నగర్‌లో ఉంది.
ఎస్సార్ నగర్‌కు వెళ్లిన తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారులో ఉండగా, అక్షయ్ నగలను తీసుకెళ్లి అనూషకు ఇచ్చి తిరిగి వచ్చి చూస్తే కారు లేదు. అయితే అప్పటికే సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కు ఇవ్వాల్సిన రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులోనే ఉన్నట్టు అక్షయ్ గమనించి, విషయాన్ని వెంటనే రాధికకు తెలియజేశారు. ఆ తర్వాత ఆమె ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
డ్రైవర్ శ్రీనివాస్ తీసుకెళ్లిన కారు కూడా నగల డిజైనర్ రాధికదే. ఆమె వద్ద శ్రీనివాస్ కొంత కాలంగా పని చేస్తున్నాడు. ఆమె డిజైన్ చేసే నగలు రూ. కోట్లలో ఉంటాయని తెలుసుకున్న శ్రీనివాస్.. ఆమె లావాదేవీలు ఎలా ఉంటాయో తెలుసుకుని.. సమయం చూసి.. నగలతో ఉడాయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి దొంగతనాలను పోలీసులు చాలా చూసి ఉంటారని.. ఎప్పుడైనా శ్రీనివాస్ ను పట్టుకోవచ్చని భావిస్తున్నారు.
ఇప్పుడు డ్రైవర్ శ్రీనివాస్‌కు ఎదురుగా వచ్చింది అవకాశమో.. అత్యాశో.. ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది. దొరికిపోతే మాత్రం ఖచ్చితంగా అది అత్యాశే అవుతుంది. దొరకకపోవడానికి చాన్స్ లేదు. ఎక్కడైనా .. ఎప్పుడైనా దొరికి పోవడం ఖాయమే. అందుకే.. దొంగతనం ఎప్పటికీ అవకాశం కాదని అతనికి తెలిసిపోయే అవకాశాలు. ఉన్నాయి.