YSRCP opposes SIR: కాంగ్రెస్ కూటమితో వైసీపీ - ఏపీలో SIRను వ్యతిరేకిస్తూ ఏపీ సీఈవోకు వినతి పత్రం
Andhra Pradesh: వైసీపీ క్రమంగా ఇండియా కూటమి వైపు వెళ్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఇండీ కూటమితో కలిసి వ్యతిరేకిస్తోంది.

YSRCP opposes voter list revision process in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇండీ కూటమి నేతలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. రాజకీయ దుర్వినియోగం చేసుకుని ప్రజల ఓటర్ల హక్కులను దెబ్బతీస్తుందని, పారదర్శకత లేకుండా అమలవుతుందని నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. కానీ అనూహ్యంగా వైసీపీ కూడా వ్యతిరేకించడం ఆసక్తికరంగా మారింది.
ఇండీ కూటమి పార్టీలతో కలిసి సీఈవో వద్దకు వైసీపీ నేత మల్లాది విష్ణు
వైసీపీ మాజీ ఎంపీ మల్లాది విష్ణు, వామపక్ష పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సిపిఎం) నేతలు, కాంగ్రెస్ నేత మస్తాన్ వలి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్జీలో, SIR కార్యక్రమం ద్వారా లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించే ప్రమాదం ఉందని ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో, మైనారిటీ ప్రధాన జిల్లాల్లో ఈ సవరణ ప్రక్రియ దుర్వినియోగం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి
"ఈ SIR కార్యక్రమం ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా ఉంది. ఇది TDP-BJP ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం ప్రారంభించిన కుట్ర" అని మల్లాది విష్ణు ఆరోపించారు. ఓటర్ల జాబితాను రివిజన్ చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని.. ఎన్నికల సంఘం వెంటనే ఈ కార్యక్రమాన్ని ఆపాలన్నారు. "ఈ సవరణ ప్రక్రియలో దొంగ ఓటర్లను జోడించే అవకాశం ఉంది. మునుపటి ఎన్నికల్లోనే అటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దీన్ని నిలిపివేస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది" అని కమ్యూనిస్టు నేతలు చెప్పారు. నిజానికి సర్ ప్రక్రియ ఏపీలో ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు.
జగన్ వ్యూహంలో భాగంగానే మల్లాది విష్ణును పంపించారా ?
అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ .. బీజేపీకి సన్నిహితంగా ఉంటోంది. అయితే గతంలో ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు జగన్ కు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. కానీ ఎన్డీఏ కూటమిలో ఒక్క పార్టీ కూడా మద్దతు పలకలేదు. అయినా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు ఏ సందర్భంలోనూ మద్దతు ప్రకటించలేదు. కీలకమైన బిల్లుల విషయంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికే మద్దతిచ్చారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఇండీ కూటమి పార్టీలతో కలిసి సర్ ను వ్యతిరేకించడం.. వారిలో వస్తున్న ఓ మార్పునకు నిదర్శనంగా భావిస్తున్నారు.





















