Raghurama CID : సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !
రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హాజరు కాలేదు. నాలుగు వారాల సమయం కావాలని సీఐడీ ఏడీజీకి లేఖ రాశారు. మరో వైపు ఈ నోటీసులపై హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు.
వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీసీఐడీ పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కాలేదు. 12వ తేదీన హైదరాబాద్‌లోని ఇంట్లో సీఐడీ అధికారులు గతంలో నమోదైన కేసుల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. అందులో 17వ తేదీన హాజరు కావాలన్నారు. అయితే 17వ తేదీ సోమవారం ఆయన సీఐడీ ఏడీజీకి ఓ లేఖ రాశారు. తాను అత్యవసర పని మీద ఢిల్లీకి వచ్చానని.. ఆరోగ్య పరమైన కారణాలతో డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉందన్నారు. అందుకే తనకు నాలుగు వారాల సమయం కావాలని లేఖలో కోరారు.
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
మరో వైపు రఘురామకృష్ణరాజు సీఐడీ తనకు ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సొంత ఊరు భీమవరం వెళ్లాలనుకున్న రఘురామకృష్ణరాజు...సీఐడీ నోటీసులతో తన ఆలోచన మార్చుకున్నారు. తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. నోటీసులు ఇచ్చిన సమయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. దీంతో ఏపీలో పలు స్టేషన్లలో ఆయనపై కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్‌ను రఘురామకృష్ణరాజు కులం పేరుతో దూషించారని ఫిర్యాదులు చేశారు. దీంతో పలు చోట్ల రఘురామపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
Also Read: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు... ప్రాణహాని ఉందని ప్రధానికి రఘురామ లేఖ
అట్రాసిటీ కేసులు నమోదు చేయడంపై రఘురామ ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ తాను నడుపుతున్న ఓ మత సంస్థ తరపున ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టించారని .. ఆయనతో తనకు ప్రాణహాని ఉందన్నారు. విచారణకు పిలిపించి.. జార్ఖండ్ ముఠాతో హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయన విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
Also Read: జార్ఖండ్ వ్యక్తులతో నన్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది.. ఆయనకు నచ్చకుంటే తీసేస్తారు
రఘురామ విచారణకు హాజరు కాకపోవడంతో సీఐడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన బెయిల్ షరతుల్లో విచారణకు హాజరు కావాలని ఉంది. హాజరు కాకపోతే ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లి వారెంట్ జారీ చేయించుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఆయన విచారణకు హాజరు అయినా.. కొత్తగా నమోదైన అట్రాసిటీ కేసుల్లోనూ అరెస్ట్ చూపే అవకాశం ఉంది. రఘురామ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి