(Source: ECI/ABP News/ABP Majha)
School Colleges Reopen: రేపటి నుంచి ఏపీలో స్కూల్స్ ప్రారంభం... కరోనా నిబంధనలు పాటించాల్సిందే
ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరచుకోనున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి బడిగంట మోగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ... పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలు తెరవచ్చని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.
వారంలో ముగ్గురికి కరోనా పరీక్షలు
'ఈ ఆదేశాల మేరకు తరగతిలో 20 మంది మాత్రమే ఉండాలి. విద్యార్థుల మధ్య 6 అడుగుల సామాజిక దూరం ఉండాలి. ఒకవేళ తరగతిలో 20 కన్నా ఎక్కువ మంది ఉంటే వారిని రెండు, మూడు బ్యాచ్‌లుగా విడగొట్టి బోధన చేయాలి. తరగతుల నిర్వహణకు గదులు సరిపోకపోతే కొన్ని తరగతులకు విద్యార్థులకు ఒకరోజు, మరికొన్ని తరగతులకు మరో రోజు క్లాసులు నిర్వహించాలి. ప్రతి వారం 20 మంది విద్యార్థుల్లో ఇద్దరికి, ఒక ఉపాధ్యాయుడికి కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయాలి. వారికెవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఆ బ్యాచ్‌లోని మిగిలిన వారందరికీ కొవిడ్ పరీక్షలు చేయాలి. మధ్యాహ్న భోజనాన్ని కూడా అందరికీ ఒకేసారి పెట్టకుండా బ్యాచ్‌ల వారీగా పెట్టాలి' అని ఉత్తర్వు్ల్లో పేర్కొన్నారు.
Also Read: AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు
కొవిడ్ ప్రణాళిక రూపొందించాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సూచనల మేరకు విద్యా సంస్థలు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నామని ఏపీ విద్యాశాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ మార్గదర్శకాలు కూడా పాటించాలని తెలిపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొవిడ్ నియంత్రణకు ప్రణాళికను రూపొందించుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి కచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం, స్కూల్ లోకి వచ్చేటప్పుడు అందరికీ శరీర ఉష్ణోగ్రతలు చెక్ చేయాలని ఆదేశించింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్న వారిని ఇంటికి పంపించేయాలని తెలిపింది. పాఠశాలలో విద్యార్థులు గుంపులుగా ఉండడం, అసెంబ్లీ, ఆటలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.
Also Read: APSWREIS Recruitment 2021: రెండ్రోజుల్లో ముగియనున్న గడువు.. ఈ పోస్టులకు అప్లయ్ చేశారా?
ఉపాధ్యాయులందరికీ టీకాలు
పిల్లలను పాఠశాలలో దించేందుకు వచ్చే తల్లిదండ్రులకు కొవిడ్ లక్షణాలుంటే వారికి కూడా కరోనా పరీక్షకు పంపాలని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఉపాధ్యాయులందరికీ టీకాలు వేయించాలని ఆదేశించింది. ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీకి సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరక్టర్ తగిన నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు.
15 వేల బడుల్లో నేడు-నేడు పనులు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 15,715 సూళ్లలో నాడు-నేడు తొలి విడత పనులు దాదాపు పూర్తయ్యాయి. పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రూపుదిద్దారు. ఈ వాతావరణం చూసి పూర్తిస్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా ఏర్పాట్లు చేశారు. గతంలో ఉండే బ్లాక్ బోర్డులు తీసివేసి విద్యార్థుల కంటిపై ప్రభావం చూపని గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో జాతీయ నేతలు, స్వాతంత్య్ర ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, ఇతర రంగాల నిపుణుల ఫొటోలను, వివిధ ప్రయోగశాలల్లో జరిగే కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ప్రతి స్కూల్లో విద్యుత్ సౌకర్యం, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇతర ఫర్నిచర్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.