AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు
కరోనా కల్లోలంతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టంది. ఆ విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టండి.
కల్లోల కరోనా ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కుటుంబాలను చిదిమేసింది. ప్రతీ రంగాన్ని కుదేలు చేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ఏపీ సర్కార్ అండగా నిలబడుతోంది. ఆ పిల్లలు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టంది. ఆ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడ చదువుతున్నా ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. గత రెండేళ్లలో కరోనా కారణంగా 6800 మంది పిల్లలు తమ తల్లి, తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. ఇంకా ఎవరైనా వివరాలు నమోదు చేసుకోకపోయే చైల్డ్ ఇన్ఫో డేటా ప్రకారం గుర్తించాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వల్ల అనాథలైన విద్యార్థులు ఏ పాఠశాలలో చదువుతున్నా ఆ స్కూళ్లలోనే కొనసాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టంది.
ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం వర్తింపు
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, ఇతర కారణాలతో బడి మానేసిన వారిని గుర్తించి వారికి ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద చదువు చెప్పించనుంది. తల్లిదండ్రులను కోల్పోయిన మొత్తం 6800 మంది పిల్లల్లో 4333 మంది పిల్లల వివరాలను అధికారులు సేకరించారు. వీరిలో 1659 మంది గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీల్లో, 2150 మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నట్లుగా గుర్తించారు. 524 మంది శిశువులు ఉన్నారని తెలిపారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల వివరాలను ఆ విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ చైల్డ్ ఇన్ఫో డేటాలో వెంటనే నమోదు చేయాలి. ఈ పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అక్కడే కొనసాగించాలి. ఫీజు చెల్లించలేదనే కారణంతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆ విద్యార్థులను స్కూళ్ల నుంచి తొలగించరాదు. తొలగిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లల చదువులు కొనసాగేలా చర్యలు చేపట్టాలి. జగనన్న విద్యా కానుక కింద వారికి మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగు, షూ, సాక్సులు, బెల్టు, డిక్షనరీలను విద్యార్థులకు అందించాలి. ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు అందించేందుకు అయ్యే ఖర్చును విద్యా శాఖ భరిస్తుంది. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లల విషయంలో తలెత్తే సమస్యలను ఉన్నతాధికారులకు తెలియచేయాలని స్పష్టం చేసింది.
Also Read: AP Blank Gos Ragada : ఏపీలో 'బ్లాంక్ జీవో"ల గొడవ ! ప్రభుత్వ రహస్య పాలన సాగిస్తోందా..?