YSRCP : శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ ! ఇక "రద్దు తీర్మానాన్ని" ఉపసంహరించుకుంటారా ?
ఏపీ శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ లభించనుంది. దీంతో గతంలో చేసిన శాసనమండలి రద్దు తీర్మానం ఉపసంహరించుకుంటారా ? రద్దుకే కట్టుబడి ఉంటారా? అన్నదానిపై రాజకీయవర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. 3 ఎమ్మెల్యే కోటా, 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని స్థానాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఎమ్మెల్యే కోటాలోనూ.. ఇటు స్థానిక సంస్థల కోటాలోనూ విపక్షాలకు పోటీ పడే బలం లేదు. ఈ కారణంగా ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీ బలం అనూహ్యంగా పెరగనుంది. ప్రస్తుతం వైసీపీకి 18 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకి 17 మంది ఉన్నారు. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీ సభ్యుల సంఖ్య 18 నుంచి 32కు పెరుగుతుంది. ఆ మేరకు టీడీపీ బలం పడిపోతుంది.
Also Read : బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగింది.. అభ్యర్థులు కోర్టుకు వెళ్తే వాళ్లు జైలుకే
మండలిని రద్దు చేస్తూ గత ఏడాది జనవరిలోనే తీర్మానం !
శాసనమండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి ఇద్దరు, ముగ్గురు బలం మాత్రమే ఉండేది. ఈ కారణంగా రాజధాని బిల్లులకు శాసనమండలిలో ఆటంకం ఏర్పడింది. ఇతర బిల్లలను ఆమోదించిన మండలి .. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో రాజధాని బిల్లులు మాత్రం సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. అయితే ఆ తర్వాత మళ్లీ అవే బిల్లుల్ని ఆమోదించడం.. తర్వాత కోర్టులకు చేరడంతో ప్రస్తుతం వివాదం కోర్టులో ఉంది. ఈ వివాదం జరుగుతున్నప్పుడే సీఎం జగన్ శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. 2020 జనవరిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ .. శాసనమండలి రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యాంగంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 (1) ప్రకారం.. మండలిని రద్దు చేస్తున్నట్లుగా తీర్మానం చేశారు. తీర్మానికి మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండాలన్న నిబంధన ఉండటంతో... విపక్షపార్టీల సభ్యులు ఎవరూ లేకపోయినప్పటికీ ఓటింగ్ నిర్వహించారు. 133 మంది ఎమ్మెల్యేలు తీర్మానికి మద్దతిచ్చారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపారు.
Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వెంటనే మండలి రద్దు !
కేంద్రం ఈ తీర్మానాన్ని బిల్లుగా మార్చి ఉభయసభల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. మండలి రద్దు విషయంలో రాజ్యాంగంంలో అసెంబ్లీకి పూర్తి అధికారం ఇచ్చారని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం మండలి రద్దు తీర్మానం కేంద్రం వద్ద ఉంది. కేంద్ర న్యాయశాఖ ఆ తీర్మానాన్ని బిల్లు రూపంలోకి మార్చి పార్లమెంట్లో ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే కేంద్రం ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. సాంకేతికంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి..గెజిట్‌లో ప్రకటించిన తర్వాతే మండలి రద్దవుతుంది. శాసనమండలి రద్దు తీర్మానం చేసిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మండలి రద్దు తీర్మానం ప్రస్తావం తెస్తూనే ఉన్నారు. కానీ కరోనా కారణంగా పార్లమెంట్ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగని కారణంగా ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పడుతూనే ఉంది.
పూర్తి మెజార్టీ వస్తుందని తెలిసినా రద్దు చేస్తున్నామన్న సీఎం జగన్ !
శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ వచ్చేసింది కనుక ఇక మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటారా అన్న సందేహం కొంత మందిలో ఉంది. కానీ అలాంటి చాన్స్ లేదని భావిస్తున్నారు. ఎందుకంటే.. శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీకి పూర్తి మెజార్టీ అనూహ్యంగా రాలేదు. పదవి కాలం ముగిసిపోతున్న ప్రతి ఒక్క ఎమ్మెల్సీ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థే అవుతారని ముందుగానే తెలుసు. 2021 చివరి కల్లా పూర్తి మెజార్టీ వస్తుందని స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. అయినా తాము మండలి అనవసరం అనే నిర్ణయించి రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అందుకే శాసనమండలి రద్దుపై సీఎం జగన్ వెనక్కి తగ్గుతారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు కూడా భావించడం లేదు.
Also Read : పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?
మండలి రద్దు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పదవులకు ఎసరు !
శాసనమండలి రద్దుపై జగన్మోహన్ రెడ్డి మండలి రద్దుపై వెనక్కి తగ్గితే మాట తప్పారన్న విమర్శలు వస్తాయి. మండలి రద్దుపై తాము వెనక్కి తగ్గడం లేదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. అందుకే తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేరని అంటున్నారు. కేంద్రం ఎప్పుడైతే రాష్ట్ర తీర్మానాన్ని క్లియర్ చేయాలనుకుంటే అప్పుడు మండలి రద్దు అయిపోతుంది. పదవులన్నీ పోతాయి. ఇది వైఎస్‌ఆర్‌సీపీకి భవిష్యత్‌లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఈ విషయంలో అధికార పార్టీ వ్యూహకర్తలు ఎలాంటి ప్రణాళికలు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఏం కావాలన్నా అడగండి.. బాధితులకు రూ.1000 చొప్పున ఖర్చులకు ఇవ్వండి
తీర్మానం ఆమోదించవద్దని బతిమాలుతున్నారని రఘురామ ఆరోపణలు !
శాసనమండలి రద్దు కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తానని.. తమ ప్రభుత్వం ఆమోదించి పంపించిన తీర్మానాన్ని తక్షణం బిల్లుగా మార్చి ఆమోదింప చేయాలని కేంద్రాన్ని కోరుతానని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చెబుతూ ఉంటారు. తమ పార్టీ నేతలే ఆ తీర్మానాన్ని ఆమోదించవద్దని కేంద్రాన్ని బతిమాలుతున్నారని ఆయన విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే తీర్మానాన్ని కేంద్రం తిరస్కరించడానికి వీల్లేదు. అయితే ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చు. కానీ అలా వైఎస్ఆర్‌సీపీ చేస్తే రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తీర్మాన విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒత్తిడి చేయకపోతే కేంద్రం కూడా పక్కన పెట్టే అవకాసం ఉంది. ఒక వేళ రాజకీయ పరిస్థితులు మారితే... ఏపీ అధికార పార్టీతో సంబంధం లేకుండానే మండలిని రద్దు చేసే అధికారం.. కేంద్రానికి ఉంది. తీర్మానం ద్వారా రాష్ట్రమే కేంద్రానికి ఆ అధికారం ఇచ్చారు.
Also Read : "ఎయిడెడ్"పై స్పష్టత ఉంది.. టీడీపీనే రాజకీయం చేస్తోందన్న సజ్జల !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి