Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా.. అందులో 8 ఏకగ్రీవం అయ్యాయి. 46 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 15న పోలింగ్ జరుగుతుంది.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండురోజులే సమయం ఉంది. ఈలోగా అభ్యర్థులంతా ప్రచారం ముగించాలని, తమ డివిజన్లోని అన్ని ప్రాంతాలను చుట్టేయాలని, వీలైతే ప్రతి గడపా తొక్కాలని, ప్రతి ఓటర్‌ని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, వాయుగుండం కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షంలో బయటకు వెళ్లలేక అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.
వర్షంలో తెగించి ప్రచారానికి వెళ్లినా, తలుపులేసుకుని ఇంట్లో ఉంటారు కానీ ప్రజలెవరూ తమని కనీసం ఇంటిలోకి కూడా రానివ్వరనే భయం అభ్యర్థుల్లో ఉంది. పోనీ అభ్యర్థులు వర్షాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్లినా.. కనీసం తోడు వచ్చేందుకు కూడా ఎవరూ రాలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైమ్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలోనే తడుస్తూ ప్రచారం చేపట్టారు.
ఆయన అభ్యర్థి కాదు, అభ్యర్థుల బంధువూ కాదు.. కానీ తన నియోజకవర్గంలో వైసీపీ పట్టు నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. చొక్కా తడిసిపోయింది, ప్యాంటు తడిసిపోయింది. మొత్తం మనిషే తడిసి ముద్దయ్యాడు. కానీ గొడుగు నీడన కూడా లేకుండా జోరు వానలో తడిసిన బట్టలతోనే ఆయన ప్రచారం చేపట్టారు. వానలోనే స్వాగతాలు, వానలోనే హారతులు.. అన్నీ వానలోనే సాగాయి.
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా.. అందులో 8 ఏకగ్రీవం అయ్యాయి. 46 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 15న పోలింగ్ జరుగుతుంది. అటు టీడీపీ తరపున కార్పొరేష్ ఎన్నికలకోసం మాజీ మంత్రులు నెల్లూరులో మకాం వేయగా.. వైసీపీ తరపున ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అభ్యర్థులతో కలసి ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు.
Also Read : మగవాళ్లు చూపిస్తే తప్పులేదు...ఆడవారు చూపించ కూడదా..ఇదేనా సమానత్వం..!
చెన్నైని తలపిస్తున్న నెల్లూరు.. రోడ్లపై వరదనీరు
వారం రోజులుగా చెన్నైలో వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు పరిస్థితి కూడా అలాగే ఉంది. వాయుగుండం ప్రభావం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై తీవ్రంగా ఉండటంతో నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలబడిపోయింది. వర్షపు నీరు చేరడంతో రైల్వే అండర్ బ్రిడ్జ్ ల వద్ద ప్రయాణికులు నరకం చూస్తున్నారు. టూ వీలర్లు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నా.. కొంతమంది సాహసం చేస్తున్నారు. ఆటోలు, కార్లు మాత్రం వరద నీటిలోనే వెళ్లాల్సి వస్తోంది.
నెల్లూరు నగరంలోని ప్రధాన కూడలి అయిన గాంధీబొమ్మ సెంటర్లో వరదనీరు ప్రవాహంలా మారింది. గాంధీ బొమ్మ చుట్టుపక్కల నీరు చేరింది. దీంతో ప్రధాన రోడ్లపై కూడా ప్రయాణం సాధ్యం కావడంలేదు. స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో రోడ్లపై రద్దీ తగ్గింది. మరోవైపు దుకాణాలు తెరవడానికి కూడా వ్యాపారులు సాహసం చేయలేదు. వరద నీటితో నెల్లూరు నగరంలోని రోడ్లు నిండిపోయాయి.
Also Read : అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
Also Read: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే.. థ్రిల్లే కాదు.. దిల్ కూడా దోచుకుంటాయ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి