రూ.6.6 కోట్ల నోట్ల కట్టలతో అమ్మవారికి అలంకరణ
మహబూబ్ నగర్ లోని బ్రాహ్మణవాడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ అర్యవైశ్య సంఘం వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ప్రత్యేకత చాటుకున్నారు. ఏకంగా 6 కోట్ల 66 లక్షల 66 వేల 6 వందల 66 రూపాయాలతో అమ్మవారిని అలంకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడు నుంచి నిపుణులను రప్పించి రూ.50 నుంచి రూ.500 వరకూ నూతన కరెన్సీతో వివిధ రూపాల్లో మలిచి గర్భాలయంతో పాటు దేవాలయంలో అలంకరించారు. 2022లోనూ ఇక్కడ 5.55 కోట్ల నోట్లతో అలంకరించారు. ప్రతి భక్తుడికి కూడా అమ్మవారి సన్నిధిలో ఉంచి లక్ష్మీ పూజ చేసిన రూపాయి బిళ్ళ అందరికీ ప్రసాదంగా ఇవ్వబడుతుందని నిర్వహకులు తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.