Nagoba Jathara Banpen persapen | కోనేటి నీళ్లు, పుట్టమట్టి..నాగోబా జాతరలో ఈ పూజలు తెలుసా | ABP Desam
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మేస్రం వంశీయులు నాగోబా మహాపూజ అనంతరం కొత్త కోడళ్ళకు భేటింగ్ నిర్వహించి, గోవాడలో సాంప్రదాయ నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారు. అనంతరం కొత్తకోడళ్లు కోనేరు వద్దకు వెళ్లి నీటిని తీసుకొచ్చి పుట్ట మట్టితో బాన్ దేవతలకు పూజలు చేస్తారు. దీంతో కొత్తకోడళ్ల భేటింగ్ పూర్తి అయిపోతుంది. ఇక వారు మెస్రం వంశీయులుగా పరిగణించబడతారు ఆపై తమ అన్ని దేవతలను చూస్తూ పూజించే హక్కును కలిగి ఉంటారు. ముందుగా మెస్రం వంశ పెద్దలు గోవాడకు చేరుకొని మహిళలు తెచ్చిన బుట్టలలో నైవేద్యాలకు పూజలు చేసి దర్శించుకుంటారు. గోవాడలో మహిళలు బుట్టిలో తీసుకొచ్చిన ఆవుపేడను ఏడు రకాల నైవేద్యాలను అక్కడి నుండి భాజా భజంత్రీల నడుమ నాగోబా ఆలయం వెనకాల ఉన్న బాన్ పెన్, పెర్సాపేన్ దేవతల వద్దకు తీసుకొని వెళ్తారు. బాన్ పెన్ ఆలయ సమీపంలో మెస్రం వంశ అల్లుళ్ళు మట్టిని తెచ్చి ఉంచగా ఆవుపేడను అక్కడ పెడతారు. ఆపై అందరు కలిసి బాన్ పేన్, పెర్సాపేన్ దేవతాలారా మేము నాగోబా మహాపూజ చేసి వచ్చాము దీవించండి ఇక మీకు పూజలు చేసి దర్శించుకోవడం కోసం వచ్చాము అని ఒకసారి అందరూ మొక్కులు చెల్లిస్తారు. మెస్రం వంశ పెద్దలు పెర్సా పెన్ దేవతకు నాలుగు సగాల వారి పూజలను నిర్వహిస్తారు. నాలుగు, ఐదు, ఆరు,ఏడు గోత్రాల వారు ఈ నలుగురి గోత్రల వారందరికీ పూజలు చేస్తారు. పూజలు చేసేందుకు నాలుగు గోత్రల వారు నాలుగు కొబ్బరికాయలు నాలుగు రకాల నవధాన్యాలు నైవేద్యాలు సమర్పించగా.. అలాగే ఐదు, ఆరు ,ఏడు గోత్రాల వారు కూడా వారి గోత్రాల క్రమ సంఖ్య పద్ధతిలో కొబ్బరికాయలు నా పెద్దలు సమర్పిస్తూ పూజలు చేస్తారు. ఇక ఈ పూజలను కటోడ, పూజారులు పూజలు నిర్వహించి అందరూ ఒకేసారి దర్శించుకుంటారు. ఆపై వంశంలోని వారు తమ తమ సాంప్రదాయ మక్కువలను చెల్లిస్తారు. అనంతరం బాన్ దేవత వద్ద పూజలు ప్రారంభిస్తారు. మెస్రం వంశ అల్లుళ్ళు, కొత్త కోడళ్లు వంశ పెద్ద మహిళ వరుస క్రమంలో తలపై కుండలను, చెంబులను ఎత్తుకొని సాంప్రదాయ రీతిలో మర్రిచెట్ల వద్ద ఉన్న కోనేరు వద్దకు చేరుకుంటారు. కోనేరుకు చేరుకున్నాక కోనేరు నీటికి మెస్రం వంశ అల్లుళ్ళు ఏడు రకాల ధాన్యాలతో పూజలు చేసి మొక్కుతారు. ఆపై అందరూ దర్శించుకుని, అపై అల్లుళ్లు కొత్త కోడళ్లు తీసుకొచ్చిన కుండలు చెంబులలో కోనేరు నీటిని సేకరించి అక్కడినుండి వరుస క్రమంలో ఒకరి వెంట ఒకరు క్రమశిక్షణ పద్ధతిలో నడుచుకుంటూ ఆలయం వెనకాల ఉన్న బాన్ దేవతల వద్దకు చేరుకుంటారు. గోవాడ నుంచి తీసుకొచ్చిన ఆవుపేడను మట్టిలో ఈ నీటిని కలిపి ఇస్తారు. మేస్రం పటేల్ వంశీయుల మహిళలు మట్టితో పుట్టను తయారుచేసి పూజలు చేస్తారు ఆపై ఆ మట్టితో గుండ్రటి ఉండలను తయారుచేసి బాన్ ధేవత వద్ద ఉంచి మొక్కుతారు మళ్ళీ ఆ ఉండలను యధావిధిగా పుట్ట వద్దకు చేర్చి పుట్టలాగే తయారుచేసి మొక్కుతారు. ఆపై కొత్త కోడళ్లతో కలిసి పూజలు చేయిస్టారు. దీంతో వారి పూజా కార్యక్రమాలు పూర్తయిపోతాయి. వంశ కొత్త కోడళ్ళు ఇక మేస్రం వంశీయులుగా పూర్తిగా పరిగణింపబడతారు. అనంతరం తమ బాన్ పేన్, పేర్సాపేన్ పూజ కార్యక్రమాలను ముగించుకొని, గోవాడలోకి మహిళలు వంశ పెద్దలు ఆలయంలోకి వారి వారి గమ్య స్థానాలకు చేరుకుంటారు. రెండు రోజుల తర్వాత మండగాజిలి, బేతాళ పూజా కార్యక్రమాలకు సిద్ధమవుతారు.





















