Maganti Gopinath Political Journey | 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం మాగంటి సొంతం | ABP Desam
మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న మాగంటి గోపీనాథ్ చాలా చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆయన వయస్సు 62ఏళ్లు కాగా 40ఏళ్ల రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాగంటి గోపీనాథ్ 1983లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన మాగంటి గోపీనాథ్..అన్నగారు స్థాపించిన పార్టీలోనే 22ఏళ్ల వయస్సులో చేరిపోయారు. కుర్రాళ్లను పార్టీ కార్యక్రమాలకు సమీకరించటం...రాష్ట్ర వ్యాప్తంగా యువతను పెద్దఎత్తున రాజకీయాల్లోకి తీసుకురావటం వంటి పనుల ద్వారా ఎన్టీఆర్ కళ్లలో పడిన మాగంటి గోపినాథ్ ఆయన ఆశీస్సులతో తెలుగు దేశం పార్టీ యువత విభాగమైన తెలుగు యువతకు అధ్యక్షుడిగా బాధ్యతలను 24ఏళ్ల వయస్సులో అందుకున్నారు. అప్పటి నుంచి 1992 వరకూ అంటే ఏడేళ్ల పాటు మాగంటి గోపీనాథే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను చూసుకున్నారు. తన పనితీరుతో ఎన్టీఆర్ ను మెప్పించి 1987లోనే హుడా డైరక్టర్ పదవిని అందుకున్నారు. అలా పార్టీలోనే కింద స్థాయిలో అనేక పదవులను అందుకున్న మాగంటీ గోపీనాథ్ సిన్సియారిటీని చూసిన చంద్రబాబు 2014లో టీడీపీ టికెట్ ఇచ్చి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయించారు. అప్పటికి పీజేఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి బలమైన వర్గంగా ఉన్న విష్ణువర్థన్ రెడ్డిని ఓడించి తన కెరీర్ లోనే మొదటి అవకాశంలోనే విజయం సాధించి ఎమ్మెల్యేగా ప్రస్థానాన్ని ప్రారంభించిన మాగంటి...2018లో తెలంగాణలో టీడీపీ బలహీనపడటంతో చంద్రబాబుకు చెప్పి పార్టీకి రిజైన్ చేసి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ లో చేరారు. అలా 35ఏళ్ల తన టీడీపీ అనుబంధానికి స్వస్తి చెప్పిన మాగంటి...2018లో రెండోసారి, 2023లో మొన్న తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత అజారుద్దీన్ పై గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు మాగంటి గోపీనాథ్.





















