England vs India 1st Test Rahul Pant Centuries | బాజ్ బాల్ బాబులకే...చుక్కలు చూపించిన పంత్, రాహుల్ | ABP Desam
మోడ్రన్ డే టెస్ట్ క్రికెట్ ను బతికించామని ఇంగ్లండ్ సగర్వంగా చెప్పుకునే ఆటతీరే బాజ్ బాల్. పరిస్థితులకు తలొగ్గకుండా ఎక్కడైనా ఎలాంటి కండీషన్ లో అయినా దూకుడు మంత్రాన్ని పాటించటమనే స్ట్రాటజీతో టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లండ్ కొత్త ఒరవడిని సృష్టించింది. అయితే బాజ్ బాల్ బాబులకే చుక్కలు చూపిస్తున్నారు ఈసారి ఇంగ్లండ్ లో టూర్ లో మనోళ్లు. హెడింగ్లేలో జరుగుతున్న మొదటి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లు ముగిసేప్పటికి ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యం పొందిన భారత్... నాలుగో రోజు ఇంగ్లండ్ బౌలర్లకు చుక్క చుక్కలు చూపించారు. ప్రత్యేకించి మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్, స్పైడీ రిషభ్ పంత్ లు బాజ్ బాల్ బాబులకే బాబుల్లా ఆడారు. రాహుల్ గోడలా పాతుకుపోయి సెంచరీ బాదితే...వరదా వాడిని ఆపు అన్నా సాగని పంత్ బాబు రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదేసి టెస్టుల్లో తనెంత ప్రమాదకరమైన ఆటగాడినో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. 140 బాల్స్ లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన పంత్ 118 పరుగులు చేశాడు. ఈ రోజు లాస్ట్ సెషన్ సగం వరకూ భారత్ ఆడి డిక్లేర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కు నాలుగు వందల పైన టార్గెట్ ఇస్తే ఈ రోజు లాస్ట్ సెషన్, రేపు రోజంతా ఇంగ్లండ్ ఎలా నిలబడుతుంది అనే దాన్ని బట్టి ఈ టెస్టులో జయాపజయాలు ఆధారపడతాయి. ఈ రోజు భారత్ ఆడిన తీరు చూస్తుంటే టెస్టులో ఫలితం రాబట్టాలని టీమిండియా కచ్చితంగా ప్లాన్ చేస్తోంది అని అర్థం అవుతోంది.





















