Eng vs Ind Second test Day 3 Highlights | రెండో టెస్టుపై పట్టు బిగించిన టీమిండియా | ABP Desam
మొదటి టెస్టు ఓడిపోయిన కసితో బర్మింగ్ హాంలో ఇంగ్లండ్ తో రెండో టెస్టు ప్రారంభించిన టీమిండియా మూడు రోజుల ఆట ముగిసే సరికి పటిష్ఠ స్థితికి చేరుకుంది. మూడో రోజు ఆటలో సగంపైగా ఇంగ్లండ్ దే అయినా చివర్లో మన బౌలర్లు పుంజుకుని బ్రిటీషర్ల తోక కట్ చేయటంతో రోజు ముగిసే సరికి భారత్ దే పై చేయిగా మారింది. మూడో రోజు ఆట మొదలు కాగానే డీఎస్పీ సిరాజ్ 2 వరుస వికెట్లతో ఇంగ్లండ్ ను కష్టాల్లోకి నెట్టేశాడు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. రూట్, స్టోక్స్ తో సహా అందరూ అయిపోయారు. ఇంకేంముంది ఏ 100-150 మధ్యలో ఆలౌట్ ఇంగ్లండ్ అనుకుంటే...బ్రూక్స్, జేమీ స్మిత్ అడ్డు పడ్డారు. మాములు అడ్డు కూడా కాదు..ఇద్దరూ భారీ సెంచరీలు బాదేశారు. బాజ్ బాల్ ఆటను రుచి చూపిస్తూ వన్డే తరహాలో బౌండరీలతో విరుచుకుపడ్డారు. మొదటి, రెండు సెషన్లు పూర్తిగా ఆధిపత్యం చూపించి చూస్తుండగానే బ్రూక్ 158, స్మిత్ 184పరుగులు చేశారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్ కు 303 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ ను ఈజీగా 400 పరుగులు దాటేలా చేయగలిగారు. అయితే ఆకాశ్ దీప్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీయటంతో భారత్ మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. ఇక మిగిలిన మళ్లీ సిరాజ్ మియా చూసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ ధాటికి ఇంగ్లండ్ 407పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ వెంటనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే టైమ్ కి యశస్వి జైశ్వాల్ వికెట్ ను కోల్పోయి 64పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 244 పరుగులు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు భారత్ రెండున్నర సెషన్లు కనీసం ఆడి 250 పరుగులు చేయగలిగితే ఇంగ్లండ్ ఒక్క రోజులో ఛేదించలేనంత లక్ష్యం నిర్దేశించవచ్చు. బౌలర్లు మళ్లీ రఫ్పాడిస్తే రెండో టెస్టును టీమిండియా సగర్వంగా సొంతమూ చేసుకోవచ్చు.





















