Eng vs Ind Second Test Day 1 Highlights | తడబడినా..మొదటి రోజు నిలబడిన టీమిండియా | ABP Desam
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టెస్టును కోల్పోయిన టీమిండియా..రెండో టెస్టులో మొదటి రోజు తడబడి తర్వాత నిలబడింది. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 15 పరుగులకే కేఎల్ రాహుల్, 95 పరుగుల టీమ్ స్కోర్ కే కరుణ్ నాయర్ అవుట్ అవ్వటంతో డల్ గానే లంచ్ బ్రేక్ కి వెళ్లింది. ఫస్ట్ టెస్టులో సెంచరీ తో రెచ్చిపోయిన యశస్వి జైశ్వాల్ మరోసారి కెప్టెన్ గిల్ తోడుగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 107 బంతుల్లో 13 ఫోర్లుతో 87పరుగులు చేసి...స్టోక్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుటై తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. జైశ్వాల్ తర్వాత వచ్చిన పంత్ 25 పరుగులు, నితీశ్ 1 పరుగుకే వెనుదిరగటంతో టీమిండియా 211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో మన సీన్ అయిపోయిందనే అనుకున్నారు అంతా. కానీ కెప్టెన్ గిల్ పోరాడాడు. సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తోడుగా స్టైక్ రొటేట్ చేసుకుంటూ బౌండరీలు దొరకబుచ్చుకుంటూ స్కోరు బోర్డును మూడో సెషన్ లో పరుగులు పెట్టించాడు. ఫలితంగా టెస్టుల్లో 7 సెంచరీ పూర్తి చేసుకోవటంతో పాటు టీమిండియాను కుప్పకూలకుండా ఆదుకున్నాడు. గిల్ కు ఇంగ్లండ్ పై ఇది వరుసగా రెండో సెంచరీ. మొదటి టెస్టులోనూ సెంచరీ బాదిన గిల్ కు జడేజా 41పరుగులతో మంచి సహకారం అందించాడు. ఈ ఇద్దరూ కలిసి 99పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పటంతో మొదటి రోజు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి భారత్ 310 పరుగులు చేసింది. చూడాలి రెండోరోజు జడ్డూ తోడుగా కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్ ను ఎంత దూరం తీసుకువెళ్తాడు అనే దాన్ని బట్టి రెండో టెస్టుపై టీమిండియా పట్టు ఎలా ఉండనుందో అర్థం అవ్వనుంది.





















