Eng vs Ind Fourth Test Draw Day 5 Highlights | తెగువ చూపించి మాంచెస్టర్ టెస్ట్ ను డ్రా చేసిన యంగ్ ఇండియా | ABP Desam
కొన్ని మ్యాచ్ లు ఉంటాయి. అవి డ్రా ముగిసినా కూడా ఆ పోరాటం విజయం కంటే గొప్పది. అచ్చంగా అలాంటిదే నిన్న భారత్ ఇంగ్లండ్ తో డ్రా గా ముగించిన మాంచెస్టర్ టెస్టు. సిరీస్ లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ను ఓడించి సమాధానం చెప్పాలని భారత్ ప్రయత్నించినా...తమదైన బాజ్ బాల్ కు భిన్నంగా రోజులకు రోజులు కరిగిస్తూ ఇంగ్లండ్ ఆడిన సావధాన టెస్ట్ మ్యాచ్ కు భారత్ అంతకంటే జిడ్డు ఆటతో బదులు ఇచ్చింది. ముఖ్యంగా మ్యాచ్ ను కనీసం డ్రా గా ముగించాలంటే ఐదో రోజంతా భారత బ్యాటర్లు నిలబడాల్సిన పరిస్థితుల్లో...టీమిండియా ఆటగాళ్లు చూపించిన తెగువను చరిత్ర గుర్తు పెట్టుకుంది. అసలు మాంచెస్టర్ టెస్టును భారత్ డ్రా గా ముగించిందంటే అది నిజంగా అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే మనోళ్లు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 358పరుగులకు ఆలౌట్ అయిపోతే ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏకంగా 669 పరుగులు చేసింది. తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ అనూహ్యంగా సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ గిల్, మిస్టర్ డిపెండబుల్ కేఎల్ రాహుల్ గోడల్లా నిలబడ్డారు. అలా గిల్ 78పరుగులు, రాహుల్ 87పరుగుల ఓవర్ నైట్ స్కోరు మీద ఉన్నప్పుడు 137పరుగుల లోటుతో భారత్ ఐదో రోజు ప్రారంభించింది. కాసేపటికి రాహుల్ 90పరుగులకు ఔట్ అయిపోవటంతో భారత్ ఐదో రోజు ఎక్కువ సేపు నిలబడలేదులే అని ఇంగ్లండ్ అభిమానులంతా భావించి ఉంటారు. కానీ కెప్టెన్ గిల్ కాసేపు నిలబడ్డాడు. ఈ సిరీస్ లో నాలుగో సెంచరీని కంప్లీట్ చేశాడు. 103పరుగుల దగ్గర ఉన్నప్పుడు గిల్ కూడా ఔట్ అవుటంతో భారత్ అభిమానులు కూడా ఫిక్స్ అయి ఉంటారు ఇక ఈ సిరీస్ ఇక్కడితో డిసైడ్ అయిపోతుందని. కానీ నెంబర్ 1 ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తలొగ్గలేదు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి అద్భుతమైన పోరాటం చేశాడు. మొదటి సెషన్ లోనే రెండు వికెట్లు తీసుకున్న ఇంగ్లండ్ కు మిగిలిన రెండు సెషన్ల పాటు అసలు వికెట్టే ఇవ్వకుండా దుమ్ము దులిపేశారు. 206 బాల్స్ కరిగించి సుందర్ కెరీర్లో తొలి టెస్ట్ సెంచరీ సాధిస్తే...185 బంతులు ఆడిన జడ్డూ 107పరుగులు చేసి కెరీర్ లో ఐదోది..ఈ సిరీస్ లో మొదటి సెంచరీని పూర్తి చేశాడు. జడ్డూ, వాషీ కలిసే 60 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా ఇంగ్లండ్ అస్సలు ఊహించని విధంగా ఈ మ్యాచ్ ను డ్రా చేసుకుని భారత్ సిరీస్ ను సజీవంగా ఉంచింది. ఇక మూడు రోజుల్లో జరగబోయే ఆఖరి లండన్ టెస్ట్ మ్యాచ్ ను భారత్ గెలిస్తే సిరీస్ 2-2 తో డ్రా చేసే అవకాశం ఉంది యంగ్ టీమిండియాకు





















