Narendra Modi Took Charge AS PM | మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ | ABP Desam
PM Modi Took Charge In PMO: భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆయన మూడోసారి తన విధుల్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పీఎంవోలోని (PMO) ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. కాగా, రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందుతుంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 'రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేస్తాం. మాది కిసాన్ కళ్యాణ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం.. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ఫైల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం.' అని ప్రధాని పేర్కొన్నారు.