Transgender Marriage: ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమాయణం - ఫ్యామిలీని ఒప్పించి ఘనంగా వివాహం, ఎక్కడంటే?
Telangana News: ప్రేమకు లింగ భేదం అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లాడాడు. జగిత్యాల జిల్లాలో వీరి వివాహం వేడుకగా జరిగింది.
Young Man Marriage With Transgender In Jagitial District: వారిద్దరూ ఒకరినొకరు రెండేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.?. ఆ అబ్బాయి ప్రేమించింది ఓ ట్రాన్స్‌జెండర్‌ను. యువకుడు తన కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ వారందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. తమ బిడ్డ ప్రేమను అంగీకరించి.. అతని ఇష్టాలను గౌరవించిన యువకుడి తల్లిదండ్రులు ఘనంగా వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా (Jagitial District) గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్, అదే గ్రామానికి చెందిన మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ను కరుణాంజలిని వివాహం చేసుకున్నాడు. వీరద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది పెళ్లి పీటలకు చేరింది.
ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయిన శ్రీనివాస్.. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం చెప్పాడు. అయితే, ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటని తొలుత కుటుంబసభ్యులు ప్రశ్నించగా.. వారికి నచ్చచెప్పి ఒప్పించాడు. తమ బిడ్డ సంతోషమే ముఖ్యమని భావించి అర్థం చేసుకున్న యువకుడి తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది. యువకుడి కుటుంబ సభ్యులు, ట్రాన్స్‌జెండర్ల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. అనంతరం పెళ్లి ఊరేగింపులో ట్రాన్స్ జెండర్లు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితం ఇచ్చిన యువకుడిని స్థానికులు అభినందించారు. ప్రేమకు లింగ భేదం అడ్డురాదని రుజువైందని చర్చించుకున్నారు.