Telangana Year Ender 2021 : గులాబీకి పూలు - రాళ్లు కూడా .. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికిన 2021 !
తెలంగాణలో ఈ సారి రాజకీయంగా వచ్చిన మార్పులు అంటే ఈటల బీజేపీలో చేరడం.. షర్మిల కొత్త పార్టీ ప్రారంభించడం అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో జరిగే కీలక మార్పులకు ఈ ఏడాదే నాంది పడింది.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రతీ ఏడూ ఓ మైలురాయిని అందుకుంటోంది. 2021లో కూడా తెలంగాణలో ఎన్నో కీలకమైన మైలురాళ్లు చోటు చేసుకున్నాయి. రాజకీయంగా పలు ఉపఎన్నికలు తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చేలా చేశాయి. ఈ ఏడాది ముగిసిపోతున్న సందర్భంగా తెలంగాణలో 2021లో చోటు చేసుకున్న విశేషాలను నెల వారీగా సింహావలోకనం చేద్దాం..!
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
జనవరి - హోరెత్తిన కేటీఆర్ సీఎం నినాదం !
2021 జనవరి నెల మొత్తం కేటీఆర్ సీఎం అనే నినాదమే ఎక్కువగా వినిపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక కేటీఆర్ బాధ్యతలు చేపట్టమే మిగిలిందని ప్రకటించడం ప్రారంభించారు. మొదట రెడ్యానాయక్ కేటీఆర్ సీఎం అవుతారని ప్రకటించారు. తర్వాత ఈటల రాజేందర్ కూడా సీఎం మార్పు ఉండొచ్చని తేల్చారు. అప్పటికీ టీఆర్ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తి బయట పెట్టని ఈటల కేటీఆర్ సీఎం అవడానికి అంగీకారం తెలిపారు. ఆ తర్వాత ఇతర నేతలూ అదే వాయిస్‌ను కోరస్‌గా వినిపించారు. కానీ ఆ నెలలో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోలేదు. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగలడంతో టీఆర్ఎస్ మాత్రం బీజేపీ విషయంలో తన స్టాండ్ మార్చేసుకుంది. అంతకు ముందు యుద్ధమే అని ప్రకటించిన కేసీఆర్.. జనవరిలో రణం లేదు.. రాజీ లేదని ప్రకటించి... రాజకీయంగా టీఆర్ఎస్‌కు జనవరిలో కీలకమైన మలుపు తిప్పారు.
Also Read: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
ఫిబ్రవరి : ఈటల రెబలిజం ప్రారంభం.. షర్మిల పార్టీ ప్రకటన !
2021 ఫిబ్రవరి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకం అని చెప్పుకోవచ్చు. ఈటల రాజేందర్ .. సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించింది ఫిబ్రవరిలోనే. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా కేసీఆర్ మాట్లాడటంతో పాటు ధాన్యం కొనబోమని ప్రకటించారు. దీనిపై ఈటల పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఆయన వ్యాఖ్యలకు ఇతర పార్టీలు మద్దతు పలికాయి. టీఆర్ఎస్‌లో నాయకత్వ మార్పు చేయాలంటే ఈటలకే ఎక్కువ అర్హత ఉందనే వాయిస్‌లు ఎక్కువగా వినిపించాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలందరూ అదే చెప్పారు. దీంతో టీఆర్ఎస్ హైకమాండ్‌తో ఈటలకు దూరం పెరిగింది. అయితే ఈ సమయంలోనే కేసీఆర్ సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని.. సీఎం మార్పు అని ఎవరూ ప్రకటనలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు ఫిబ్రరిలోనే పాదయాత్ర చేసి.. పదవి రాక ముందు జనసత్వాలు అందించే ప్రయత్నం చేశారు. ఇక తెలంగాణలో అత్యంత కీలకం రాజకీయ పరిణామంగా మారిన షర్మిల పార్టీకి ఈ నెలలోన బీజాలు పడ్డాయి. పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లుగా షర్మిల అధికారికంగా ప్రకటించారు. ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతులను అత్యంత దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించింది.
Also Read: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్ రోహిత్' మర్చిపోలేని 2021
మార్చి : ఎమ్మెల్సీల్లో గులాబీ గుబాళింపు !
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరిగాయి. ఈ రెండింటిలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. నల్లగొండ నుంచి బరిలో దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి...హైదరాబాద్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణి దేవి ఎమ్మెల్సీలుగా గెలిచారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కేసీఆర్ పీఆర్సీ ప్రకటించాు. 30 శాతం వేతనాలు పెంచారు. ఉద్యోగ పదవీ విరమణ తేదీన 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఇద్దరు కలెక్టర్లు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ చెప్పిన తీర్పు మార్చిలో కలకలం రేపింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనంతసాగర్ రిజర్వాయర్ కు భూసేకరణలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ అధికారులు పట్టించుకోలేదు.
Also Read: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021
ఏప్రిల్ : కరోనా డెల్టా ఎఫెక్ట్... నైట్ కర్ఫ్యూ టైం
తెలంగాణలో డెల్టా వేరియంట్ ప్రభావం కారణంగా నైట్ కర్ఫ్యూతో ఆంక్షలను తెలంగాణ సర్కార్ ఏప్రిల్‌లో ప్రారంభించింది. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు తగ్గాయి. కానీ ఈ వేరియంట్ కారణంగా వందల మంది చనిపోయారు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన గుర్తు అయిన గాజు గ్లాస్‌ను కోల్పోయింది. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లలో అయినా పోటీ చేసి ఉంటే నిబంధనల ప్రకారం కామన్ గుర్తు కేటాయిస్తారు. కానీ జనసేన పోటీ చేయలేదు.
Also Read: స్టార్ హీరోలు.. ఈ ఏడాది ఒక్క రిలీజ్ కూడా లేదే..
మే : సాగర్‌లో కారు జోరు.. ఈటలపై వేటు
నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి... చనిపోయిన నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ విజయం సాధించారు. ఆ తర్వాత మినీ లోకల్ పోల్స్‌లోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఫలితాలు వచ్చిన వెంటనే..ఈటల రాజేందర్‌పై వేటు వేయడాన్ని కేసీఆర్ ప్రారంభించారు. మే ఒకటో తేదీన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖను ఆయన నుంచి తప్పించారు. రైతులు ఫిర్యాదు చేశారన ిమెదక్ జిల్లాలోని ఈటల పౌల్ట్రీ ఫామ్ వద్దకు వెళ్లి విజిలెన్స్.. ఇతర అధికారులు విచారణ జరిపారు. ఈటల అధీనంలో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లుగా వారు నివేదిక ఇచ్చారు. దీంతో ఆయనను తప్పించారు. ఆ తర్వాత వేగంగా ఆయను మంత్రి పదవి నుంచి తప్పించడం.. వరకూ జరిగిపోయాయి. తర్వాత ఆయన అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపినా చివరికి బీజేపీ వైపు మొగ్గు చూపారు.
Also Read: ఈ ఏడాదీ యువరాజ్ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!
జూన్ : ఈటల మాజీ - దళిత బంధు ప్రకటన - రేవంత్ పీసీసీ చీఫ్
ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ ఆమోదించారు. హుజూరాబాద్ స్థానం ఖాళీ అయిందని.. వెంటనే అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం జూన్‌లో పెరిగిపోయింది. మాటల మంటలు చెలరేగాయి. పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోలేదు. కేసీఆర్ ఈ నెల నుంచే జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. సిద్దిపేట, కామారెడ్డి వంటి చోట్ల జిల్లాల పర్యటనలు చేశారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు సాయం అందించాలని నిర్ణయించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న టీ పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక .. ఈ నెలలో పూర్తయింది. రేవవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించారు.
Also Read: 2021లో లాంచ్ అయిన సూపర్ హిట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..
జూలై : షర్మిల పార్టీ లాంచ్ - నీళ్లు నిప్పులు - రామప్పకు ప్రపంచ గుర్తింపు
జూలైలో వైఎస్ఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ వేదికగా ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆవిష్కరించారు. కోకాపేట భూముల్ని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయడం ప్రారంభించింది. రూ. ఐదువేల కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలకు నీళ్లపై హక్కుల్ని శాశ్వతంగా కోల్పోయాయి. ఇప్పుడు మొత్తం కేంద్రం చేతిలో పెత్తనం ఉంది. అక్రమ ప్రాజెక్టుల పేరుతో గొడవలు పడిన తెలుగు రాష్ట్రాల పరిస్థితిని.. కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ రాసిన లేఖను అడ్డం పెట్టుకుని కేంద్రం.. ఏకంగా కృష్ణా, గోదావరీ నది పరిధిలోని 107 ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంది. గెజిట్ విడుదల చేసింది. తెలంగాణలో వివాదాస్పద ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హఠాత్తుగా తన పదవికి రాజీనామాచేసి బీఎస్పీలో చేరారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించకున్నారు.ఎల్.రమణ సహా పలువురు నేతలు టీఆ్ఎస్ కండువా కప్పుకోవాలని జూలైలో డిసైడయ్యారు. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. అరుదైన ఇంజనీరింగ్, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ప్రపంచ స్థాయి కట్టడంగా ఎట్టకేలకు గుర్తింపు సాధించింది. చైనాలో జరిగిన యూనెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను ప్రకటించారు.
ఆగస్టు : హుజూరాబాద్ వేడి
తెలంగాణలో ఆగస్టు మొత్తం హుజురాబాద్ ఉపఎన్నికల వేడి కనిపించింది పెద్ద ఎత్తున నేతల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం.. దలిత బంధు పథకాన్ని అమలు చేయడం వంటి వాటిపై దృష్టి పెట్టారు. తెలంగామ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మొదటి విడత పాదయాత్రను కూడా ప్రారంభించారు. కేసీఆర్ ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయిలో పార్టీ, ప్రభుత్వంపై దృష్టి సారించి రాజకీయం చేయడంతో టీఆర్ఎస్‌లో ఓ రకమైన అప్రమత్తత కనిపించింది. అయితే ఇతర చోట ఇచ్చిన ఉపఎన్నికల నోటిఫికేషన్... హుజురాబాద్‌కు ఇవ్వకపోవడంతో కాస్త సైలెంటయ్యారు.
సెప్టెంబర్ : వైట్ చాలెంజ్ - చైసామ్ విడాకులు- హుజూరాబాద్ ఉపఎన్నిక
తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్‌లో డ్రగ్స్ టెస్టుల చాలెంజ్ నడిచింది. రేవంత్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ చాలెంజ్ విరసరడంతో రచ్చ రచ్చ అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమానికి జగన్ హాజరు కాలేదు. ఏడాది జనవరిలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ సీరియల్ ముగిసింది. షెడ్యూల్ ప్రకారం అందర్నీ ప్రశ్నించారు. అయితే విచారణ సీరియల్ రెండో సీజన్ లేదని కూడా ఈడీ వర్గాలు ప్రకటించాయి. సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య అధికారిక ప్రకటించారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు.
అక్టోబర్ : హెటెరోలో సోదాలు - షర్మిల పాదయాత్ర
హెటెరో ఫార్మా కంపెనీలో జరిగిన సోదాల్లో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం కనుగొన్నట్లుగా ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. ఇందులో రూ.142.87కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరు రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా తెలిపింది. మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించింది. అయితే వివాదాల కారణంగా ప్రకాష్ రాజ్ టీం మొత్తం రాజీనామా చేసింది. తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల స్వప్నం స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ప్లీనరీ నిర్వహించారు.
నవంబర్ : ఈటల విజయం -
హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఉపఎన్నికల మ్యాజిక్ పని చేయలేదు. ఈటల రాజేందర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినప్పటికీ జన బలం ఈటల రాజేందర్ వైపే నిలిచింది. ఆయన 23వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణను సీడ్ బౌల్ గాఐక్యరాజ్య సమితినే గుర్తించింది. ఐరాసకు చెందిన అంతర్జాతీయ ఆహార సంస్థ ఎఫ్.ఎ.వో నుంచి ఈ మేరకు సమాచారం వచ్చింది.
డిసెంబర్ : అంతా ధాన్యం రాజకీయం !
తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం తర్వాత రాజకీయం మారిపోయింది. పూర్తి స్థాయిలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా రెండు పార్టీలు పోరాటం ప్రారంభించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు అంశం మీద కేంద్రంపై సమరం ప్రకటించారు. ఆ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది.
తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఈ ఏడాది భిన్నంగా ఉన్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యర్థి ఎవరు అన్నదానిపై ప్రజల్లోనూ కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. వచ్చే ఏడాది రాజకీయంలో దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.