Top Headlines Today: కిషన్ రెడ్డి అడ్డగింత! ఏపీలో అప్పులపై వైసీపీ Vs బీజేపీ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఛలో బాటసింగారంతో హైదరాబాద్‌లో ఉద్రిక్తత
చలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయబోయారు. ఈ ఉదయం నుంచి ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రభుత్వం కడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూసేందుకు బీజేపీ నేతలు చలో బాటసింగారం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని అప్రమత్తమైన పోలీసులు బీజేపీ లీడర్లను అరెస్టు చేస్తున్నారు. ఇంకా చదవండి
ఏపీ అప్పులపై వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఆరోపణల విషయంపై బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. పురందేశ్వరి చేసిన ఆరోపణలపై పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు లోబడే అప్పు చేస్తోందని, తెచ్చిన ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఇంకా చదవండి
దుర్గమ్మ సన్నిధిలో మరో అపచారం
విజయవాడ దుర్గమ్మ వారి ఆలయంలో మరో వివాదం తెర మీదకు వచ్చింది. అమ్మవారి నివేదన తయారు చేసే గదిలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళటం పై ఈవో సీరియస్ అయ్యారు. ఈమేరకు వైదిక కమిటిలోని అర్చకులకు ఆమె నోటీసులు ఇచ్చారు. వైదిక కమిటిలోని అర్చకులు చేసిన పని పై విచారణ చేపట్టారు. అమ్మవారికి అత్యంత నిష్టతో ప్రసాదం తయారు చేస్తారు. ఇందుకు ప్రత్యేకంగా వ్యవస్ద కూడ ఉంటుంది. నిబందనలు ప్రకారం గుర్తింపు పొందిన అర్చకులు, వైదిక కమిటిలోని సభ్యులు మాత్రమే అమ్మవారికి నివేదన తయారు చేస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా వంట శాల ఉంటుంది. అయితే అమ్మవారి నివేదన తయారు చేసే వంట శాలలోకి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహరం ఈవో వద్దకు చేరింది. ఇంకా చదవండి
గోదావరిలో వరద ఉద్ధృతి
ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువలా వచ్చి పడుతున్న వరద ప్రవాహంతో అఖండ గోదావరిలో వరద ఉధృతి తీవ్రమౌతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం నుంచి దిగువకు వస్తున్న వరద ప్రవాహంతో ధవళేశ్వరం సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద భారీగా పెరుగుతోంది... ఈరోజు ఉదయం 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.30 అడుగులకు చేరింది. అవుట్ ఫ్లో 4,16,719 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదల చేశారు. మూడు కాలువల ద్వారా 13,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో అవుట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంకా చదవండి
తెలంగాణ స్కూల్స్‌కు ఇవాళ రేపు సెలవులు
తెలంగాణాలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రాష్ట్రంలో పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే సెలువులు ఇచ్చినట్లు సర్కారు చెబుతోంది. హైదరాబాద్‌లో 75 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నాలాలు పొంగడంతో పలు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీట మునిగాయి. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కారణంగా భాగ్యనగరంలోని పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈ క్రమంలోనే నగరవాసులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. దాదాపు 60 మంది వరకూ ఫిర్యాదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మాదాపూర్ 5 సెం.మీ, కేపీహెచ్ బీలో 4.98 సెం.మీ, మూసాపేట 4.73 సెం.మీ, జూబ్లీ హిల్స్ 4.65 సెం.మీ, మియాపూర్ లో 7.40 సెం.మీ, టోలీ చౌకీ 6.65 సె.మీ, హైదరాదాద్ 5.68 సెం.మీ వర్షం కురిసింది. ఇంకా చదవండి