Heavy Rains in Telangana: తెలంగాణ స్కూల్స్‌కు ఇవాళ రేపు సెలవులు- వర్షాల కారణంగా ప్రభుత్వం నిర్ణయం
Heavy Rains in Telangana: తెలంగాణలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తుండగా.. రెండ్రోజుల పాటు బడులకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు భద్రాచలం వద్ద నీటిమట్టం పెరిగిపోయింది.
![Heavy Rains in Telangana: తెలంగాణ స్కూల్స్‌కు ఇవాళ రేపు సెలవులు- వర్షాల కారణంగా ప్రభుత్వం నిర్ణయం Heavy Rains in Telangana And Two Days Holydays For Schools in State Wide Heavy Rains in Telangana: తెలంగాణ స్కూల్స్‌కు ఇవాళ రేపు సెలవులు- వర్షాల కారణంగా ప్రభుత్వం నిర్ణయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/20/cc02e6f79a71c04ba5bbbe9618d918a11689823150923519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heavy Rains in Telangana: తెలంగాణాలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రాష్ట్రంలో పాఠశాలలకు రెండు రోజులపాటు సెలవులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే సెలువులు ఇచ్చినట్లు సర్కారు చెబుతోంది. హైదరాబాద్‌లో 75 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. నాలాలు పొంగడంతో పలు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీట మునిగాయి. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కారణంగా భాగ్యనగరంలోని పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈ క్రమంలోనే నగరవాసులు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేశారు. దాదాపు 60 మంది వరకూ ఫిర్యాదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మాదాపూర్ 5 సెం.మీ, కేపీహెచ్ బీలో 4.98 సెం.మీ, మూసాపేట 4.73 సెం.మీ, జూబ్లీ హిల్స్ 4.65 సెం.మీ, మియాపూర్ లో 7.40 సెం.మీ, టోలీ చౌకీ 6.65 సె.మీ, హైదరాదాద్ 5.68 సెం.మీ వర్షం కురిసింది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
మరోవైపు గత మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమేపీ పెరుగుతుంది. నిన్న రాత్రి 34 అడుగుల వద్ద వున్న గోదావరి ప్రస్తుతం 39 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఎగువన ఉన్న తాలిపేరు, మేడిగడ్డ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టర్ ప్రియాంక వరద పరిస్థితిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. పునరావాస కేంద్రాలను సిద్దం చేశారు.
ఆయా జిల్లాల్లో అతిభారీ వర్షాలు - ఐఎండీ అలర్ట్
ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం - దక్షిణ ఒడిశా తీరంలో ఉండి, సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల వాయువ్య, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురిసే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)