Godavari Floods : గోదావరిలో వరద ఉద్ధృతి - ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి విడుదల !
గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. నీటిని సముద్రంలోకి వదిలి పెడుతున్నారు.
Godavari Floods : ఎగువ ప్రాంతాల నుంచి వెల్లువలా వచ్చి పడుతున్న వరద ప్రవాహంతో అఖండ గోదావరిలో వరద ఉధృతి తీవ్రమౌతుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. భద్రాచలం నుంచి దిగువకు వస్తున్న వరద ప్రవాహంతో ధవళేశ్వరం సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద భారీగా పెరుగుతోంది... ఈరోజు ఉదయం 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.30 అడుగులకు చేరింది. అవుట్ ఫ్లో 4,16,719 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలోకి విడుదల చేశారు. మూడు కాలువల ద్వారా 13,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో అవుట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సముద్రంలోకి నీటి విడుదల
అఖండ గోదావరి నది ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం సర్ ఆర్డర్ కాటన్ బ్యారేజ్ వద్ద వరద నీరు భారీగా చేరడంతో రాబోయే మూడు రోజుల్లో సుమారు అయిదు లక్షల క్యూసెక్కులు వరద నీరు దిగువకు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి నిన్న 1,90,000 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేశారు. ఈ రోజు మరింత పెరగడంతో 4,16,719 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం వరద ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. గోదావరి తీర ప్రాంత ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం వరద హెచ్చరికలు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో, ధవళేశ్వరం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైఅలర్ట్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో ఆలమూరు మండలం బడిగువానిలంక, కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారిలంక, కేదారిలంక ,పాలేపులంక, కే గంగవరం మండలం శేరిలంక కోటిపల్లి, పి గన్నవరం మండలం జీ. పెదపూడి ప్రాంతాలు ముందుగా వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఎనిమిది బోట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ బోట్లు నిర్వహణ సంబంధించి మత్స్యశాఖ అధికారులు నియమించడం జరిగిందని ఆయన వెల్లడించారు..
కంట్రోల్ నెంబర్ల ఏర్పాటు..
వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా ప్రతి వరద ప్రభావిత ప్రాంతానికి ప్రత్యేక అధికారులను నియమించామని వారి వివరాలు వారి ఫోన్ నెంబర్లను కూడా వెల్లడించారు..
కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004252532
ధవలేశ్వరం కంట్రోల్ రూమ్ నెంబర్ 0883 2417066
ఆలమూరు, కపిలేశ్వర పురం మండలాలు, ఎన్ డేవిడ్ రాజు Ph.9948029350, ఎన్ నవ్య Ph.9866443065,
కే గంగవరం మండలం , ఎన్ డేవిడ్ రాజు Ph.9948029350, నాయుడు దిలీప్ తేజ Ph.9441604624,
పి గన్నవరం మండలం
pdk ప్రసాద్ Ph.7095687724 జి జి బాబూజీ ph 9494957498 లో సంప్రదించాలని సూచించారు.