Telangana Ration Card Guidelines: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
Ration Cards in Telangana: ఆరు గ్యారంటీల అమలుకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు ఖరారు చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Telangana Ration Cards News: హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చాక తమ మార్క్ పాలన కోసం మార్పులు చేపట్టింది. ఇదివరకే రెండు గ్యారంటీలకు సంతకాలు చేసి అమలు చేస్తున్నారు. మరోవైపు ప్రజా పాలన అందించే ప్రభుత్వం తమది అంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చెబుతున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు ఖరారు చేయలేదని, కసరత్తు చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు (TS Minister Sridhar Babu) తెలిపారు. రేషన్ కార్డులకు నిబంధనలు ఇవేనంటూ ప్రచారం జరగడంతో మంత్రులు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం కచ్చితంగా హామీ ఇచ్చిన 6 గ్యారంటీల (6 Guarantees)ను అమలు చేస్తుందన్నారు.
ప్రజా పాలన గ్రామసభలు..
డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయా ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను సైతం నియమించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజాపాలన నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రజల నుంచి స్వీకరించే దరఖాస్తులను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఎంతో ప్రయోజనం చూకూర్చేరేషన్ కార్డులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై చర్చలు..
గత ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డులు తొలగించలేదు, కొందరు అర్హులను లబ్దిదారుల జాబితాలో చేర్చలేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు పాటించాల్సిన నిబంధనలు రూపొందించాల్సి ఉంది. రాష్ట్రంలో ఇదివరకే పింఛను తీసుకుంటున్న వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునే వారు అర్హులమని భావిస్తే దరఖాస్తు చేసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఇప్పటివరకు 25వేల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామ్నారు మంత్రి శ్రీధర్‌బాబు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు జరగనున్న ప్రజాపాలనలో ప్రతిరోజు రెండు షిఫ్టులలో గ్రామసభల నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొన్ని నెలలుగా రేషన్ తీసుకోని కార్డులు ఉంచాలా.. తీసేయాలా అనేదానిపై అధికారులతో మంత్రులు చర్చించారు. అర్హులకే రేషన్ కార్డులుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కొన్నిరోజుల కిందట ఆదేశించారు. సంక్షేమ పథకాలకు, రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే.. కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై చర్చించినా నిర్ణయం తీసుకోలేదు. ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత 9 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాని సంగతి తెలిసిందే.