Telangana News: తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Caste Census: తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ సీఎస్ ఉతర్వులు జారీ చేశారు.
Comprehensive Caste Census In Telangana: సమగ్ర కులగణనపై (Caste Census) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు సర్కారు జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi Kumari) వెల్లడించారు. ఈ సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగించారు. 60 ఏరోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపైనా ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను శుక్రవారం నియమించింది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చీఫ్‌గా నియమితులయ్యారు. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ కులాల వర్గీకరణ అమలుకు నియమించిన కమిషన్ నివేదిక తర్వాతే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్లు వేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం గడువు నిర్దేశించారు. కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని సీఎస్‌కు సూచించారు. మంత్రివర్గ ఉప సంఘానికి అందిన వినతులపైనా సమావేశంలో చర్చించడం సహా, వాటన్నింటినీ ఏక సభ్య కమిషన్‌కు అందించాలని నిర్ణయించారు. ఉమ్మడి పది జిల్లాల్లోనూ క్షేత్రస్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరించేలా పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.
ఇందిరమ్మ కమిటీలపై..
మరోవైపు, ఇందిరమ్మ కమిటీలపైనా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామస్థాయిలో సర్పంచి లేదా ప్రత్యేక అధికారి, కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ ఛైర్మన్‌గా మున్సిపాలిటీ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇద్దరు ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తాయి. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను సర్కారు ఆదేశించింది.