Telangana News: తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
Telangana Police Department: సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో ముందడుగు వేసింది. రాష్ట్ర సైబర్ బ్యూరో అధికారులు ఆర్బీఐకు కీలక సూచనలు చేశారు.
Telangana Cyber Security Bureau Key Suggestions To Rbi: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఏర్పాటు చేసింది. అయితే, సైబర్ నేరాలకు సంబంధించి విచారణలో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది. నేరాలు జరుగుతున్న తీరును అధ్యయనం చేసి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆర్బీఐకు తాజాగా కొన్ని సూచనలు చేసింది. ఫిర్యాదు చేసినప్పటికీ సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల కొల్లగొట్టిన డబ్బు బాధితునికి రావడం లేదని గుర్తించారు. ఈ క్రమంలో అనవసర జాప్యం నివారిస్తే ఫలితం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆర్బీఐకి సూచించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే లావాదేవీ నిలిపేసేందుకు బ్యాంకులు అవసరమైతే ఓ కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తద్వారా ఏ బ్రాంచి ద్వారా డబ్బు పోయింది, ఏ బ్రాంచిలో జమైంది వంటి వివరాలన్నీ క్షణాల్లోనే తెలిసిపోతాయని వారు పేర్కొన్నారు. కాగా, సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్, దీనికి అనుబంధంగా 1930 నెంబర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్కడి సిబ్బంది బాధితుడి నుంచి వివరాలన్నీ సేకరించి వాటిని సంబంధిత బ్యాంకుకు అందజేస్తారు. బాధితుడి ఖాతా నుంచి ఏ ఖాతాలో డబ్బు జమైందో బ్యాంకు గుర్తించి సదరు లావాదేవీని వెంటనే నిలిపేయాల్సి ఉంటుంది. అయితే, బ్యాంకుల మధ్య సమన్వయం లేకపోవడం, అవగాహన లోపం వల్ల త్వరగా స్పందించడం లేదు. ఈ అంశాలపైనే రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఆర్బీఐకు కీలక సూచనలు చేసింది. సైబర్ భద్రతా ప్రమాణాలపై తాము చేసిన సూచనలను అమలు చేసేందుకు ఆర్బీఐ అంగీకరించిందని అధికారులు తెలిపారు.
Also Read: BRS Future : కేసీఆర్‌కు కఠిన సవాల్ - చాణక్యం అంతా చూపించి పార్టీ ఉనికిని కాపాడుకుంటారా ?