CM Revanth Reddy: 'ప్రకృతి వనంగా తెలంగాణ' - పర్యాటక పాలసీతో ఎకో టూరిజం ప్రోత్సహిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధికి కట్టుబడి ఉందని.. త్వరలోనే టూరిజం పాలసీని తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ఎక్సీపీరియం పార్కు ప్రారంభించారు.

CM Revanth Reddy Launched World Calss Experium Park In Rangareddy District: తెలంగాణను ప్రకృతివనంగా మార్చాలని.. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును (Experium Park) ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉందని.. ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లిందని అన్నారు.
'టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. దేవాలయాల దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం. రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నాం. ఎక్సీపీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ ఈ పార్కును అభివృద్ధి చేయడం అభినందనీయం. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉంది. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతీ విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్కను నాటించి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నాం. త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తాం.' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ రాందేవ్‌ను ప్రశంసించారు. మన హైదరాబాద్‌లోనే ఇలాంటి మొక్కలను రాందేవ్ తీసుకురావడం అభినందనీయమని అన్నారు. 'పొద్దుటూరు ప్రదేశం నాకు ముందే తెలుసు. నేను ఇల్లు కట్టుకున్నప్పుడే రాందేవ్ నాకు కొన్ని విదేశీ మొక్కలు ఇచ్చారు. మా ఇంటి వద్ద పెరిగిన మొక్కలను చూస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తోంది.' అని పేర్కొన్నారు.
పార్క్ ప్రత్యేకతలివే..
కాగా.. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ఎక్సీపీరియం పార్కును ప్రపంచస్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో తీర్చిదిద్దారు. దీనిలో 25 వేల జాతుల మొక్కలున్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఎక్సీపీరియం పార్కులో రూ.లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువైన అరుదైన చెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పలు వృక్షాలను సినీ, రాజకీయ ప్రముఖులు కొనుగోలు చేశారు. రాందేవ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఈ పార్కు తీర్చిదిద్దారు. దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్‌ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంపీ థియేటర్ ఏర్పాటు చేశారు. రూ.150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా పేరొందింది.
Also Read: Telangana News: గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు





















