KCR fires on PM Modi: విశ్వ గురువుగా గొప్పలు! 10 ఏళ్లు కావస్తున్నా స్పందించలేదు: మోదీపై కేసీఆర్ ఫైర్
KCR fires on PM Modi: రోడ్డు మార్గంలో బస్సులో వస్తుంటే ఆమనగల్ వద్ద తనను అడ్డుకునేందుకు కొందరు యువకులు బీజేపీ జెండాలను ప్రదర్శించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
Telangana CM KCR fires on PM Modi:
కొల్లాపూర్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ సమీపంలోని నార్లపూర్ వద్ద తొలి పంపును కేసీఆర్ ప్రారంభించారు. సాయంత్రం కొల్లపూర్ సమీపంలోని సింగోటం చౌరస్తాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. రోడ్డు మార్గంలో బస్సులో వస్తుంటే ఆమనగల్ వద్ద తనను అడ్డుకునేందుకు కొందరు యువకులు బీజేపీ జెండాలను ప్రదర్శించడంపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏం తప్పు చేశాను, ఏం మోసం చేశానని.. ఎందుకు తనను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చీము నెత్తురు ఉంటే బీజేపీ నేతలు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘రాష్ట్ర బీజేపీ నేతలు తామో అంతా అన్నట్లు మాట్లాడుతారు. కానీ మేం పాలమూరుకు, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా ఎంతో తేల్చమని కేంద్రాన్ని అడిగాం. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురువుగా గొప్పలు చెప్పుకుంటారు. మా అంత ఎవరు లేరని చెబుతారు. కానీ నీళ్ల వాటాను తేల్చాలని కృష్ణా ట్రిబ్యూనల్ కు లేఖ రాసేందుకు పదేళ్లు పడుతుందా?. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయదని అర్థమై మేం పాలమూరుతో పాటు రాష్ట్ర ప్రజల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాం.
ఏపీ, తెలంగాణలకు కృష్ణా నదీ జలాల్లో వాటా తేల్చాలని కోరడానికి కేంద్రానికి పదేళ్లు పట్టింది. కేంద్రంలో మోదీ నోరు మెదపరు, కానీ ఇవి తెలియక వీళ్లు సిగ్గులేకుండా బీజేపీ జెండాలు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు. బీజేపీ నేతలు చీము నెత్తురు ఉంటే, బుద్ధి ఉంటే కృష్ణా ట్రిబ్యూనల్ కు సమస్యను రిఫర్ చేయాలని ఢిల్లీలో పోరాటం చేయాలి. మేం సుప్రీంకోర్టును మా జలాలపై వాటాను తేల్చాలని కోరగా.. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచింది. సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటే ట్రిబ్యూనల్ కు రిఫర్ చేస్తామన్నారు. కానీ ఏడాది గడిచినా అతీగతి లేదు. ప్రజలు నిజంగానే జరిగిన నష్టంపై బీజేపీ నేతల్ని, కేంద్ర పెద్దల్ని కచ్చితంగా నిలదీయాలి. 10 ఏళ్లు గడిచినా మాకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీయాలని’ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు బీజేవైఎం కార్యకర్తలు యత్నం..
తెలంగాణలో ప్రతిష్టాత్మక పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నాగర్ కర్నూలు జిల్లాకు బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో ఆమన్ గల్ వద్దకు సీఎం కేసీఆర్ కాన్వాయ్ చేరుకోగానే కొందరు బీజేవైఎం యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును అడ్డుకోవడంలో భాగంగా రోడ్డుకు అడ్డంగా నిల్చుని నినాదాలు చేస్తుండగా.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో తృటిలో ప్రమాదం తప్పింది. జై బీజేవైఎం, జై బీజేపీ అంటూ ఆ యువకులు నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు, సిబ్బంది ఆ యువకులను అడ్డుకుని వారించారు. సీఎం కాన్వాయ్ అక్కడినుంచి కొల్లాపూర్ వైపు వెళ్లిపోయింది.