Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర విషాదం - ఆకేరు వాగులో ఐదుగురు గల్లంతు, కోదాడలో కొట్టుకొచ్చిన కార్లు
Telangana News: తెలంగాణలో భారీ వర్షాలతో పలు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆకేరు వాగులో ఐదుగురు గల్లంతు కాగా.. కోదాడలో ఇద్దరు మృతి చెందారు.
People Died Due To Rains In Telangana: తెలంగాణలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా పలుచోట్ల తీవ్ర విషాదం నింపాయి. వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతిని చూసేందుకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. మొదటగా ఫోన్ ద్వారా బాధితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వారి ఫోన్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నారు. మరోవైపు, గల్లంతైన వారిని రక్షించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. అటు, తిరుమలాయపాలెం మండలంలో రాకాసి చెరువుకు వరద పోటెత్తడంతో ఆందోళన నెలకొంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
కారులో మృతదేహం
మరోవైపు, సూర్యాపేట జిల్లాలోనూ (Suryapeta District) భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. కోదాడ (Kodada) పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీల్లో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద ఉన్న కాలువలో ఆదివారం రెండు కార్లు కొట్టుకుని రాగా.. అందులోని ఓ కారులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు కోదాడ వాలి నాగం రవిగా గుర్తించారు. అటు, కోదాడ శ్రీమన్నారాయణ కాలనీలో వరద నీటిలో ఓ టీచర్ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి బైక్‌పై ఇంటికి వెళ్తూ దారిలో గల్లంతైన వెంకటేశ్వర్లు అనే టీచర్ విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని.. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఎవరూ చూసేందుకు వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వ్యక్తిని రక్షించిన పోలీసులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూలు కల్వర్టు దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాగుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో కల్వర్టు దగ్గర వాగులో ఓ వ్యక్తి వరద ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా.. సమీపంలోకి పోలీస్ వాహనాన్ని తీసుకెళ్లిన కానిస్టేబుల్స్ ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా సాహసంతో ఆ వ్యక్తికి చేయందించి కాపాడారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. కానిస్టేబుల్స్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు
అటు, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుంచి వెళ్తున్న ఆకేరు వాగు వరద ప్రవాహంలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్‌కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రీ కూతుళ్లు కొట్టుకుపోయారు. తమ కారు వాగులోకి పోయిందని, తాము నీటిలో మునిగిపోతున్నామంటూ వారు బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో వారు ఆందోళనతో అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో గాలింపు చేపట్టగా అశ్విని మృతదేహం లభ్యమైంది.