Telangana: విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు, లెక్కలు బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Telangana News | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల కంటే ఖైదీల పరిస్థితి కాస్త బెటర్ అని, వారిపై పెట్టే ఖర్చులో సగం కూడా విద్యార్థులపై చేయడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.
RS Praveen Kumar News | హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం మారాక విద్యార్థుల సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వారి గురించి పట్టించుకునే నాథుడే లేడంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పలు శాఖలకు మంత్రులు లేరు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు మంత్రి లేకపోవడం విడ్డూరంగా ఉంది. దేశానికి విలువైన ఆస్తి అయిన విద్యార్థుల కోసం పనిచేయాల్సిన విద్యాశాఖకు సైతం మంత్రి లేడన్నారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యాలయాలను 250 నుంచి 1000 వరకు పెంచి, దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దారని కొనియాడారు. కానీ రేవంత్ సర్కార్ గురుకులాలను పూర్తిగా విస్మరిస్తోందన్నారు.
ఖైదీల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది
విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వారి కంటే ఖైదీల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న లెక్కలు వివరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, విచారణ ఖైదీలపై ఒక రోజుకు తెలంగాణ ప్రభుత్వం రూ.83 ఖర్చు చేస్తుండగా, విద్యార్థులపై ఒకరోజుకు కేవలం రూ.36 మాత్రమే ఖర్చు చేస్తోందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది చాలా బాధాకరమైన విషయం అని, తెలంగాణ ప్రజలందరూ ఇది తెలుసుకోవాలన్నారు. విద్యార్థులపై చేస్తున్న ఖర్చుకు రెండున్నర రెట్లు ఖైదీలపై ఖర్చు చేస్తున్నారని.. గత ప్రభుత్వంలో విద్యార్థులపై ఉన్న ఫోకస్ నేడు లేదని ఆరోపించారు.
‘తెలంగాణలో 12.30 లక్షల మంది విద్యార్థులు తమ స్కాలర్ షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో స్కూల్స్, కాలేజీల నుంచి విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టేవారు. విద్యార్థులకు రెండుసార్లు మటన్, నాలుగు సార్లు చికెన్, నెయ్యి ఇచ్చేవాళ్లు. దాంతో పాటు వారానికి ఐదు సార్లు ఎగ్స్, రాగి జావ, ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చేవాళ్లు.
చాలా బాధాకరమైన విషయం తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలి..
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024
నేరాలు చేసి జైల్లో ఉన్న ఒక్కొక్క ఖైదీపై రోజుకి 83 రూపాయల ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అయిన విద్యార్థులపై కేవలం 36 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుంది..
కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు… pic.twitter.com/vZKfRXZACL
ఇప్పుడు చికెట్ మూడుసార్లు పెట్టడమే గగనం, ఒకవేళ మూడుసార్లు చికెన్ పెడితే, గుడ్లు ఇవ్వడం లేదు. మటన్ అయితే మొత్తానికి బంద్ అయినట్లు కనిపిస్తోంది. గురుకుల పాఠశాలల్లోని ఫుడ్ పాయిజనింగ్ తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనంలో ఎలుకలు, పురుగులు సైతం వస్తున్నాయని ఇదివరకే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు మెరుగైన భోజనం పెట్టాలి. స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ నిధులు సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలి. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఓట్లు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని దారుణంగా మోసం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, పూర్తయిన ఎగ్జామ్స్ తో ఉద్యోగాలు భర్తీ చేసి అది తమ ఖాతాలో వేసుకుంటోందని’ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.