Revant Reddy : ఐటీ దాడుల్లో దొరికిపోయిన కేసీఆర్ కుటుంబం - అందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్ - రేవంత్ ఆరోపణలు !
కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వివరాలు చెప్పారు. ఐటీ దాడుల కారణంగానే ఢిల్లీ వెళ్లారన్నారు.
Revant Reddy : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లు హైదరాబాద్ రోడ్ల విస్తరణ, మెట్రో రైలు వంటి రాష్ట్ర ప్రయోజనాల గురించి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబ అక్రమాస్తులను కాపాడుకునేందుకే వెళ్లారన్నారు. ఇటీవల కల్వకుంట్ల కుటుంబానికి చెందినవారి కంపనీలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయని... ఈ క్రమంలోనే భారీగా ఆస్తుల వివరాలు బయటపడ్డాయని అన్నారు. ఈ ఐటీ దాడుల వివరాలు బయటకు రాకుండా కేటీఆర్ మీడియాను మేనేజ్ చేసారని రేవంత్ అన్నారు.
ఐటీ దాడుల్లో దొరికిన ఆస్తులను కాపాడుకోవడానికే
ఐటీ దాడుల్లో పట్టుబడ్డ తమ ఆస్తులను కాపాడుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారని ఆరోపించారు. పదేళ్ళుగా తెలంగాణలో దోచుకుని కూడబెట్టిన ఆస్తుల కోసమే తప్ప ప్రజలకోసం కేటీఆర్ డిల్లీకి వెళ్ళలేదన్నారు. ఢిల్లీ బీజేపీ నేతలు , కేసీఆర్ ఒక్కటేనని రేవంత్ రెడ్డి అన్నారు. వందకోట్ల లిక్కక్ స్కామ్ కు పాల్పడ్డారంటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై విచారణ జరపిస్తున్న బిజెపి ప్రభుత్వం లక్షకోట్లు దోచుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎందుకు విచారణ చేయించడంలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టే డిల్లీ బిజెపి నేతలు, బిఆర్ఎస్ ఒక్కటేనని అర్థమవుతుందని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ కు దుబాయ్ అంటే చాలా ఇష్టమని... తెలంగాణలో దోచుకున్న సొమ్ముతో ఆయన అక్కడ సెటిల్ అవుతారంటూ రేవంత్ ఎద్దేవా చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ రాష్ట్రాన్నే కాదు దేశాన్ని విడిచి పారిపోవడం ఖాయమని రేవంత్ అన్నారు.
కేసీఆర్‌ను ఓడించాలనుకునేవారు బీజేపీలో ఉండొద్దని రేవంత్ రెడ్డి పిలుపు
ఇప్పటికైనా తెలంగాణ బిజెపిలో వుంటూ బిఆర్ఎస్ ను ఎదిరించాలనుకునే భ్రమలో నాయకులు వుండొద్దని రేవంత్ సూచించారు. బిజెపి, బిఆర్ఎస్ ది సాదాసీదా బంధం కాదు ఫెవికాల్ బంధమని అన్నారు. బిఆర్ఎస్ ను ఓడించాలంటూ కాంగ్రెస్ తోనే సాధ్యమని... అందుకోసం కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ సూచించారు. డిల్లీ చుట్టు తిరగడం కంటే తెలంగాణ గల్లీల్లో తిరుగుతూ తెలంగాణకు విముక్తి కల్పిద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్‌కు రేవంత్ రెడ్డి ఇదే తరహాలో రిప్లయ్ ఇచ్చారు.
జితేందర్ రెడ్డి గారు… బీజేపీ అంతర్గత ‘తన్నులాట’ను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారు. ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు! https://t.co/OcR1Z687rt
— Revanth Reddy (@revanth_anumula) June 29, 2023
జితేందర్ రెడ్డి ట్వీట్‌కు రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మాజీ ఎంపీ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.