Revanth Reddy: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్, బీజేపీ నేతల చేరికల జోరు! కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లోకి చేరికలు జోరందుకున్నాయి. తమకు నచ్చిన, తమ నాయకుడు మెచ్చిన పార్టీల్లో చేరుతూ రాజకీయాలను రంజుగా మారుస్తున్నారు.
Revanth Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లోకి చేరికలు జోరందుకున్నాయి. తమకు నచ్చిన, తమ నాయకుడు మెచ్చిన పార్టీల్లో చేరుతూ రాజకీయాలను రంజుగా మారుస్తున్నారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చేతి గుర్తు తమ పార్టీ చిహ్నమని, చెప్పిన వాటిని చేసి చూపించడమే తమ నైజమని అన్నారు.
🔥చేతి గుర్తు మా చిహ్నం.
— Revanth Reddy (@revanth_anumula) August 30, 2023
చేసి చూపించడమే మా నైజం.
ఇచ్చిన మాట ప్రకారమే..
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే..
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో..
నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.
'కారు'కూతలు రావు
'జుటా' మాటలు లేవు
మా మాట శిలాశాసనం..
మా బాట ప్రజా సంక్షేమం..
వస్తున్నాం… pic.twitter.com/cxADgi1pd7
కర్ణాటకలో గత ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీల్లో 4 హామీలను 100 రోజుల్లోనే అమలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గృహలక్ష్మి పథకం ప్రారంభించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తమకు కారు కూతలు రావని, జూటా మాటలు లేవన్నారు. తమ మాట శిలాశాసనమని, తమ బాట ప్రజా సంక్షేమమని రేవంత్ అన్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రకటించిన హామీల అమలును వివరిస్తూ సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్ కలల్లో బతుకుతున్నారు
గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్‌ఎస్ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కలల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శాండ్, ల్యాండ్, లిక్కర్, అవినీతికి అడ్రస్ అంటూ దుయ్యబట్టారు.
తెలంగాణలో ఇస్తున్న 6 కేజీల రేషన్‌లో 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ఎన్నికల హామీలో భాగమైన దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూంలు లేవని, కేజీ టూ పీజీ విద్య లేదన్నారు. ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లు పెంచలేదని విమర్శించారు. ఉచిత ఎరువుల హామీకే పరిమితం అయిందన్నారు. నిరుద్యోగ భృతిని గాలికి వదిలేశారని అన్నారు. బీఆర్‌ఎస్ హామీలలో 90 శాతం అమలు చేయలేదని వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ పథకమైన గృహలక్ష్మీ పథకాన్ని కర్ణాటకలో ప్రారంభించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హామీ ఇస్తే అమలు చేస్తోందని మరోసారి నిరూపితమైందని హర్షించారు. ఒక ఫ్యామిలిలో ఒకే టికెట్ విషయంలో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో ఉందన్నారు. ఏఐసీసీ నిబంధనల మేరకే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా టికెట్ల ప్రకటన చేయాలని ఏఐసీసీని కోరుతున్నానని తెలిపారు.