Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ఎక్కడేసిన గొంగళి అక్కడే! ఫుడ్ పాయిజన్ జరిగినా ఏం మారలా!
IIIT Basar: బాసర ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
Nirmal District: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు నేటికి పరిష్కారం కాలేదు. 12 డిమాండ్లతో నెల రోజుల కింద ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ 7 రోజుల పాటు శాంతియుత నిరసనలు చేపట్టారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అది హామీల మేరకే గాని అమలుకు నోచుకోవడం లేదన్నది ఇటీవల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనతో నిరూపితం అయింది. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది.
సమోసాలో ఈగ!
హాస్టళ్లు, మెస్ ల్లో సమస్యలు యథాతథంగా ఉన్నాయి. నీటి శుద్ధి ప్లాంట్లు పని చేయకపోవడంతో రెండు రోజుల నుంచి క్యాంపస్ కు కలుషిత నీరు సరఫరా అవుతోంది. విద్యార్థులు మరో గత్యంతరం లేక ఆ నీటినే తాగాల్సిన పరిస్థితి ఉంది. ఇక, క్యాంటీన్ నుంచి ఒక విద్యార్థి సమోసా తీసుకురాగా, అందులో ఈగ కనిపించింది. ఇప్పటికే ఒకసారి ఫుడ్ పాయిజన్ జరిగి పలువురు అస్వస్థతకు గురయ్యారని, క్యాంపస్ లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే అందరూ జబ్బున పడే అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థుల ఆందోళన తర్వాత స్టూడెంట్ వెల్ఫేర్ విభాగంలో పని చేసేందుకు అధికారులు జంకుతున్నారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ తోపాటు స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్, కేర్ టేకర్.. ఆయా పదవుల నుంచి తప్పుకొన్నారు. వీరి స్థానాల్లో కొత్త వారిని నియమించాల్సి ఉన్నా.. రెండు, మూడు వారాలుగా జాప్యం జరుగుతూనే ఉంది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంత్రి సబిత హామీ నెల రోజులు దాటినా అమలు కాలేదు.
వర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలన్న, విద్యార్థుల డిమాండ్ ఇంకా నెరవేరలేదు. ఇటీవల ఇన్ చార్జి వీసీగా ఉన్నత విద్యామండలి చైర్మను వెంకట రమణను ప్రభుత్వం నియమించింది. ఆయనకు కూడా అదనపు బాధ్యతలు కావడంతో పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల కిందట అడ్మిషన్ పొందిన నాలుగున్నర వేల మంది విద్యార్థులకు ఇప్పటికీ ల్యాప్ టాప్‌లు, యూనిఫామ్స్ అందలేదు. వర్సిటీలో కొత్తగా బోధన సిబ్బంది నియామకాలు జరగలేదు. 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 3 వేల మంది పీయూసీ 1, పీయూసీ 2 విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులకు నలుగురు చొప్పున మాత్రమే అధ్యాపకులున్నారు.
#SSU team helping to #IIITBasar students but #trsgovt can't#SSU #resignSabithaIndra #KCRFailedTelangana pic.twitter.com/6GB8JawFz5
— Prem (@rsparmy2022) July 16, 2022
ఐసీటీ ఆధారిత విద్యా బోధన అమలు కావడం లేదు. హాస్టల్ గదుల్లో కొన్నింటికే మరమ్మతులు చేశారు. కొత్త బెడ్స్ ఏర్పాటు చేయకపోవడంతో ఉన్నవాటితోనే సర్దుకుంటున్నారు. వెయ్యి సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాల్సిఉండగా.. 300 ఫ్యాన్లు బిగించారు. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన విద్యార్థులు నిత్యం సమస్యలతో సతమతం అవుతున్నారు. ఎంత గింజుకున్నా ప్రభుత్వం తమ సమస్యలు తీర్చటం లేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న దాదాపు 300 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్పత్రుల పాలయ్యారు. అయినా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోవడంపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మండిపడుతున్నారు.