Indra Karan Reddy On BJP: త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడవుతుంది: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Indra Karan Reddy On BJP:
Indra Karan Reddy On BJP: త్వరలోనే దేశానికి బీజేపీ పీడ విరగడ అవుతుందని, సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ దేశంలో వివిధ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరిత వైఖరికి నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాం నాయక్, జెడ్పీ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. కల్లాల నిర్మాణాలకు ఉపాధి హామీ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులతో కలిసి ఎమ్మెల్యేలు, గులాబీ శ్రేణులు అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ.... ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ నిధులతో తెలంగాణ రైతుల కోసం కల్లాలు నిర్మించుకుంటే మోదీ ప్రభుత్వానికి కడుపు మంటగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపల ఆరబోతకు కల్లాల నిర్మాణం చేసుకుంటే ఉపాధి హామీ నిధులు ఇస్తూ... మన తెలంగాణ రైతులు పంట ఆరబెట్టేందుకు నిర్మించుకున్న కల్లాలకు నిధులు ఇవ్వమనడం తెలంగాణ పట్ల కేంద్రం వివక్షకు ఇది నిదర్శనమని అన్నారు. కల్లాల ఎందుకు నిర్మిస్తారో తెలియని పరిస్థితిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
రూ.12 కోట్లతో 19 వేల కల్లాలు నిర్మించుకున్నాం, కానీ !
సీఎం కేసీఆర్ రైతులు బాగుపడాలని ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రైతన్నల కడుపు కొడుతుందని మండిపడ్డారు. అంతేకాకుండా నిర్మల్ జిల్లాలో రూ. 12 కోట్లతో 19 వేల కల్లాలను నిర్మించుకున్నారని, ఇప్పుడు వాటికి నిధులు ఇవ్వమంటే రైతులు ఇప్పుడు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. వ్యవసాయ కల్లాల నిర్మాణం పూర్తి అయ్యాక రైతులకు ఉపాధి హామీ నిధులు ఇవ్వమనడం సరికాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇకనైనా రైతు వ్యతిరేఖ విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. అలాగే రైతులకు మద్దతు ధర ఇవ్వమని, ధాన్యాన్ని కొనుగోలు చేయమని, మీటర్లకు మోటార్లు పెడతామంటూ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బంది పెడుతోందని చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీలపై ఈడీ కేసులు ఉండవని, కానీ బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కమిట్మెంట్ తో ఉంటారని, గుజరాత్, యూపీలో సాగినట్లు ఇక్కడ ఆటలు సాగవని అన్నారు.