Minister Harish Rao: రేపో, మాపో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో, కేసీఆర్ అదే పనిలో ఉన్నారు - మంత్రి హరీష్ రావు
Minister Harish Rao: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా తమ పార్టీ మ్యానిఫెస్టో ఉంటుందని తెలిపారు.
Minister Harish Rao: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ కౌంటర్ ఇచ్చారు. 'డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకో.. పరువైనా దక్కుతుంది. నడ్డా ఇది కేసీఆర్ అడ్డా.. బీజేపీ చేరికల కమిటీ అట్టర్ ఫ్లాప్ అయింది.. నడ్డా తన సొంత హిమాచల్ ప్రదేశ్‌లోనే బీజేపీని గెలిపించుకోలేకపోయారు' అని ఆరోపించారు. ఇవాళ మంచిర్యాల జిల్లాలో మంత్రి హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండలం పడ్తనపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో హరీష్ పాల్గొని ప్రసంగించారు.
లిఫ్ట్ ఇరిగేషన్‌కు 80 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశామని, లిఫ్ట్‌లో 1 టీఎంసీ నీళ్లు ఎత్తిపోస్తామని హరీష్ అన్నారు.
మంచిర్యాలలో 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, గతంలో ప్రైవేట్ హాస్పిటల్స్ పెరిగితే ఇప్పుడు సర్కార్ హాస్పిటల్స్ పెరుగుతున్నాయన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కార్‌నే అని, తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందని అని చెప్పారు. ఈ సందర్బంగా తెలంగాణలో హంగ్ వస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ స్పందించారు. తెలంగాణలో హంగ్ కాదని, కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని అన్నారు. సంతోష్ కర్ణాటకలో బీజేపీని ఆగం పట్టించారని, తెలంగాణలో ఈ సారి బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని విమర్శించారు.
రేపో, మాపో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల అవుతుందని, సీఎం కేసీఆర్ అదే పనిపై ఉన్నారని హరీష్ రావు తెలిపారు. ప్రజలకు ఇంకా ఎలాంటి హామీలు ఇవ్వాలనే దానిపై కేసీఆర్ ఆలోచనలు చేస్తున్నారని, మ్యానిఫెస్టోపై కసరత్తు జరుగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసిన తర్వాత ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతుందని అన్నారు. కాంగ్రెస్ సంస్కృతి అంటేనే మాయమాటలని, మాటలు, మూటలు, మంటలు ఇదే కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో కరువు లేదని, మావోయిస్టులతో చర్చ అని మట్టుబెట్టింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. దేశానికే మోడల్‌గా తెలంగాణ మారిందన్నారు. కాంగ్రెస్ పరిస్థితి వెస్డిండీస్ టీమ్‌లా మారిందని, కేసీఆర్ ఈ సారి ఎన్నికల్లో సెంచరీ కొట్టడం ఖాయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమని చెప్పారు.
కాంగ్రెస్ నేతలు గెలుపుపై పగటి కలలు కంటున్నారని మంత్రి హరీష్ విమర్శించారు. హైదరాబాద్‌లో మత కలహాలు పెట్టి, కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని, కేసీఆర్ పాలనలో అలాంటివి లేవన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నయవంచన అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓ భస్మాసుర హస్తం అని, కల్లబొల్లి హామీలతో ప్రజల ముందుకు వస్తుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీకి 100కిపైగా స్థానాల్లో డిపాజిట్ రాలేదని, ఈ సారి కూడా అదే పరిస్థితి ఉంటుందని జోస్యం చెప్పారు. రైతులకు మూడు గంటల ఉచిత కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, రైతులపై కాంగ్రెస్ నేతలకు ప్రేమ లేదని ఆరోపించారు.