Durgam Cheruvu Bridge: దుర్గం చెరువు బ్రిడ్జ్‌పై ఆకతాయి డ్యాన్స్.. ఇలా అడ్డంగా బుక్కయ్యాడు!
దుర్గం చెరువుపై ఓ ఆకతాయి డ్యాన్స్ చేస్తూ సీసీటీవీ కెమేరాకు చిక్కాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో రాత్రయితే చాలు.. ఎవరో ఒకరు వంతెన మీదకు వచ్చి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. వీరిని నియంత్రించేందుకు పోలీసులు నిఘా సైతం పెట్టారు. సీసీటీవీ కెమేరాల ద్వారా వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా సరే వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఎవరో ఒకరు వంతెన మీదకు వెళ్లి ఆకతాయి పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. వంతెన మధ్యకు వెళ్లి డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్టు చేసిన వీడియోలో ఓ వ్యక్తి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మధ్యకు వచ్చి వాహనాలకు అడ్డంగా పరిగెట్టాడు. ఆ తర్వాత రోడ్డు మధ్యకు వచ్చి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. సీసీటీవీ ద్వారా అతడి చిందులను గమనించిన పోలీసులు వెంటనే హెచ్చరికలు జారీ చేశారు. ‘‘దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పైకి పాదచారులు రావడం ప్రమాదకరం’’ అని హెచ్చరించారు. దీంతో అతడు అక్కడి నుంచి చీకట్లో మాయమయ్యాడు. ‘‘సరదా కోసం ప్రాణాలకు తెగించి రోడ్డుపై విన్యాసాలు, డ్యాన్సులు చేయకండి’’ అంటూ ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజనులు జోకులు పేలుస్తున్నారు. ‘‘అతడు మీకు దొరికితే ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్ రోడ్డు మీద డ్యాన్స్ చేసే అవకాశం ఇవ్వండి’’ అని ఒకరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం అతడు ఏ పాటకు డ్యాన్స్ చేశాడోనంటూ గెస్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ వీడియో వైరల్‌గా మారడంతో మన హైదరాబాద్‌లోని ఆకతాయిల వేషాలు దేశమంతా ట్రెండవ్వుతున్నాయి. కొన్ని రాష్ట్రాలవారు ‘టైటిల్’ను ఇంగ్లీషులో పెట్టండి అని సైబరాబాద్ పోలీసులను కామెంట్ల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. పోలీసుల హెచ్చరికలు విన్న తర్వాత అతడు చెరువులోకి దూకేశాడా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట కొంతమంది వ్యక్తులు అర్థరాత్రి 3 గంటలకు బ్రిడ్జ్‌పై వాహనాలు పార్క్ చేసి.. సెల్ఫీలు దిగుతున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. సీసీటీవీలో వారిని గమనించగానే.. పోలీసులు ఎనౌన్స్‌మెంట్ చేశారు. అంతే దెబ్బకు వారంతా పరుగులు పెట్టారు. ప్రస్తుతం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. వంతెన మీద ఉన్న రోడ్డుపై వాహనాలు నిలపడం, మద్యం సేవించడం, వేడుకలు జరుపుకోవడం, సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడాన్ని పోలీసులు నిషేదించారు. కాబట్టి.. అటుగా వెళ్లినప్పుడు మీరు మాత్రం అలాంటివి చేసి వైరల్ కాకండి. తప్పకుండా ట్రాఫిక్ పోలీసుల రూల్స్ పాటించి సురక్షితంగా ఉండండి.
వీడియో: